కూటమి రెండేళ్ల పాలన.. 4 ప్లస్సులు - 3 మైనస్సులు..!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండున్నరేళ్లు (2024 జూన్ నుండి) పూర్తయింది.
By: Garuda Media | 6 Sept 2026 10:03 AM ISTఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండున్నరేళ్లు (2024 జూన్ నుండి) పూర్తయింది. ఈ నేపథ్యంలో కూటమి పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నది ఆసక్తికరం. అంతేకాదు.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు వచ్చే ఎన్నికల నాటికి ఏవిధంగా ముందుకు సాగాలన్న వ్యూహాలు వేసుకునేందుకు కూడా ప్రజల అభిప్రాయం కీలకంగా మారింది. ఈ రకంగా చూస్తే.. ప్రస్తుతం ప్రజల్లో కూటమిపై మిశ్రమ అభిప్రాయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనలు, రాజకీయ విశ్లేషణలు, వివిధ సర్వేల ప్రకారం ప్రజాభిప్రాయం 4 ప్లస్సులుగా, 3 మైనస్సులుగా సాగుతోందని చెబుతున్నారు. అనుకూల అంశాల విషయానికి వస్తే.. రాజధాని అమరావ తి, పోలవరం పునరుద్ధరణ బాగానే పనిచేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులను వేగవంతం చేయడం, పోలవరం పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.
అలానే, సంక్షేమ పథకాలు, పెన్షన్ల పెంపు కూడా ప్రభుత్వానికి సానుకూలత తీసుకువచ్చాయి. సామాజిక పెన్షన్లను పెంచడం, వాటిని లబ్ధిదారులకు సకాలంలో అందజేయడం ప్రజల్లో మంచి నమ్మకాన్ని కలిగించింది. అదేసమయంలో గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలపై కూడా కొంత మేరకు సానుకూలంగానే వాతావరణం కనిపిస్తోంది. 'తల్లికి వందనం', 'దీపం 2.0` వంటి పథకాలను దశలవారీగా ప్రారంభించడం మహిళా ఓటర్లలో సానుకూల ప్రభావం చూపుతోంది.
అదేవిధంగా పెట్టుబడులు, ఉద్యోగాల వ్యవహారం కూడా సానుకూలతను పెంచింది. రాష్ట్రానికి టాటా టీసీఎస్, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలను తీసుకురావడం, పరిశ్రమల పునరుద్ధరణ ద్వారా యువతకు ఉపాధి కల్పనపై భరోసా పెరిగింది.ఇక, మైనస్‌ల విషయానికి వస్తే.. హామీల అమలులో జాప్యం సర్కారుకు ఇబ్బందిగా మారింది. 'సూపర్ సిక్స్' లోని హామీలైన నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 వంటివి వర్తించకపోవడంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది.
అలానే, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆరోపణలను ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి. ఇవి కూడా ప్రజల్లో చర్చకు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిపై కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులను వేధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.
