Begin typing your search above and press return to search.

పదిహేను కాదు ఇరవై...అధికారం శాశ్వతమా ?

ఏపీలో టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అది మామూలుగా రాలేదు.

By:  Satya P   |   28 Sept 2026 11:35 PM IST
పదిహేను కాదు ఇరవై...అధికారం శాశ్వతమా ?
X

ఏపీలో టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అది మామూలుగా రాలేదు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 164 దాకా కూటమి కైవశం చేసుకుంది. అంటే 95 శాతం సీటు షేర్ అన్న మాట. ఏపీ రాజకీయ మైదానంలో అరవై శాతం దాకా ఓటు షేర్ ని రాబట్టింది. దాంతో విపక్షంలో వైసీపీ తప్ప మరో పార్టీ లేదు. రెండింటి మధ్య ఓట్ల షేర్ తేడా భారీగా ఉండడంతో కూటమిలో కొత్త ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ప్రతీ ఎన్నికల్లో యాంటీ ఇంకెంబెన్సీ అన్నది ఉన్నా ఏ అయిదు శాతం దాని వల్ల తగ్గినా మరో రెండు మూడు ఎన్నికల వరకూ తమ ఓటు షేర్ బలం కరిగిపోదు అన్న విశ్లేషణలు అయితే కూటమి పెద్దలలో ఉన్నాయి. అందుకే పదిహేనేళ్ళ పాటు ఏపీలో కూటమిదే అధికారం అని ఢంకా భజాయిస్తున్నాయి.

ఇరవై ఏళ్ల పాటు :

అయితే ఈ విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మరో అడుగు ముందుకేసి పదిహేనేళ్లు కాదు ఇరవై ఏళ్ల పాటు ఏపీలో కూటమిదే అధికారం అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. రెండు దశాబ్దాల పాటు ఏపీలో కూటమి పాలన ఉంటే తప్ప సంపూర్ణమైన అభివృద్ధి జరగదు అని ఆయన స్పష్టం చేశారు. కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని కూడా అన్నారు. ఏపీలో వైసీపీకి శాశ్వత సమాధి కడితేనే ఇది సాధ్యమని కూడా అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నిమ్మల రామానాయుడు అన్న మాటలు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి.

తరచూ మార్చుకోవద్దు :

ఇదిలా ఉంటే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లు కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. అధికారాన్ని తరచూ మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని కూడా హెచ్చరించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు 2021 నాటికే పూర్తయ్యేవని ఆయన అన్నారు. అయితే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. అందువల్ల ఆ ఇరవై ఏళ్ళు కనుక కూటమికి ఇచ్చి అధికారం నిలబెడితే ఏపీ ప్రగతి సాధిస్తుందని రామానాయుడు అన్నారు.

భారీ మెజారిటీలతో :

ఇదిలా ఉంటే భారీ మెజారిటీలు వచ్చిన పార్టీలు కానీ కూటములు కానీ మరిన్ని ఎన్నికల్లో అధికారం చలాయించిన సందర్భాలు ఉన్నాయా అని చూస్తే బహు అరుదుగానే అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం 1984లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 415 దాకా ఎంపీ సీట్లు సాధించింది. అంటే అది ఎనభై శాతం దగ్గర సీటు షేర్ అన్న మాట. విపక్షం అన్నది కూడా ఆనాడు లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ కి తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే ప్రజలు కాంగ్రెస్ ని ఓడించి రాజీవ్ గాంధీని మాజీ ప్రధానిగా చేశారు. ఇలా ఎందుకంటే అయిదేళ్ళు అన్నవి పాలకుల దృష్టిలో చాలా తక్కువ సంవత్సరాలుగా కనిపిస్తాయి కానీ ప్రజలకు మాత్రం చాలా ఎక్కువ కాలంగా కనిపించడమే.

సంబంధం ఉందా :

అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలి అన్నది ప్రజాస్వామ్యంలో ముఖ్య సూత్రం. అయితే ఒకే పార్టీతోనే అన్నది మాత్రం అందులో లేని నిబంధన. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజా సేవకులే కాబట్టి చేసి తీరాలన్నది ప్రజలు కోరుకునేది. అదే సమయంలో దశాబ్దాలుగా ఒకరికే అధికారం ఇచ్చి ప్రగతి వారితోనే సాధ్యమని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్నది ఆలోచించాల్సిందే. అయితే ఇందులో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మధ్య ప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలలో దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. దానికి కారణం ప్రతిపక్షం బలహీనంగా ఉండడం అతి ముఖ్య కారణం అని చెబుతారు. బలమైన ఆల్టర్నేషన్ ఉంటే కనుక ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఎంత బాగా పాలించినా కూడా జనాలు దించేసి ఎదుటి పార్టీకి ఓటేయడం అన్నది దేశ రాజకీయాల్లో చూసుకుంటే కనిపిస్తుంది.

కూటమిగా ఉంటేనే :

ఇక ఏపీలో మూడు పార్టీలు కలసి ఉంటేనే బలం అన్నది బహిరంగ రహస్యంగా మారింది. అయితే అందులోనే ప్లస్ మైనస్ ఉన్నాయని అంటున్నారు. పొత్తు పార్టీల మధ్య ఐక్యత ఇక్కడ ప్రధానం. అది ఒక ఎన్నికకూ మరో ఎన్నికకూ మధ్య తేడా చూపిస్తే మాత్రం ఆశించిన ఫలితాలు దక్కవని అంటున్నారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్న వారు తామే శాశ్వతంగా ఉండాలని అనుకుంటారు, విపక్షాలు దిగిపోవాలని డిమాండ్ చేస్తారు. జనాలే తీర్పు వీటికి ఇస్తారు.