బాబూ.. 'ఆ రెండూ' ఎందుకు వదిలేయాలి ..!
అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు.. ఇతర రెండు హామీల విషయా న్ని కూడా ప్రశ్నిస్తున్నారు.
By: Garuda Media | 13 Aug 2025 9:43 AM ISTఏపీ సీఎం చంద్రబాబు `సూపర్ 6` హామీల విషయంలో పట్టుదలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా.. గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్ర బాబు అమలు చేస్తున్నారు. మొత్తంగా ఆరు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.
1) అన్నదాత సుఖీభవ,
2) ఆర్టీసీ ఉచిత బస్సు,
3) తల్లికి వందనం,
4) మెగా డీఎస్సీ,
5) ఆడబిడ్డ నిధి,
6) నిరుద్యోగ భృతి.
ఈ ఆరు హామీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా కొత్త పథకాలైన ఆర్టీసీ ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి వంటివి మహిళల ఓట్లను కూటమికి అనుకూలంగా మార్చాయి.
ఇక, 14 మాసాల కాలంలో చంద్రబాబు ఈ హామీల్లో 4 అమలు చేశారు. తొలి సంతకమే మెగా డీఎస్సీపై పెట్టారు. తద్వారా.. 6475 పోస్టులను భర్తీ చేశారు. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయి. ఇక, అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సును ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నారు. తల్లికి వందనం కింద 80 లక్షల మంది తల్లులకు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. నిధులు ఇచ్చారు. ఇలా.. ఈ నాలుగు నెరవేర్చారు.
అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు.. ఇతర రెండు హామీల విషయా న్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 నెల నెలా ఇస్తామన్నారని... ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తారని అంటున్నారు. ఇక, నిరుద్యోగ భృతి విషయంపై కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. ఈ రెండు అమలు చేసేందుకు ఉన్న ఇబ్బందులు వేరేగా ఉన్నాయి. ఆడబిడ్డ నిధి అయినా.. నిరుద్యోగ భృతి అయినా.. లబ్ధిదారుల సంఖ్య భారీగానే ఉంది.
దీంతో ఈ రెండు పథకాలను పీ-4లో జమ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కానీ, దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు పథకాలను కూడా ఏదో ఒక విధంగా అమలు చేసి.. అన్నీ సంపూర్ణంగా అమలు చేశామన్న క్రెడిట్ సంపాయించుకుందామని ఎమ్మెల్యేల నుంచి సూచనలు వస్తున్నాయి. ఆడబిడ్డ నిధి అంటే.. 18-50 ఏళ్లలోపు ఉన్నవారే కాబట్టి.. ఇబ్బంది లేదని అంటున్నారు. దీనికి రెండు ఫార్ములాలు చెబుతున్నారు.
1) ఇప్పటికే వివిధ పథకాలు, పింఛన్లు పొందుతున్న మహిళలను పక్కన పెట్టడం.
2) అదేవిధంగా 18-21 ఏళ్ల మధ్య చదువుతున్న విద్యార్థినులు కూడా తగ్గిపోతారు.
సో.. మిగిలిన వారికి మాత్రమే అమలు చేస్తే సరిపోతుందని అంటున్నారు. అలానే.. నిరుద్యోగుల ఎంపిక విషయంలోనూ.. ప్రస్తుతం చదువుతున్న వారితోపాటు.. 35 ఏళ్ల వయసును కటాఫ్‌గా పెట్టుకుంటే సరిపోతుందని.. సూచిస్తున్నారు. తద్వారా పథకాన్ని అమలు చేయొచ్చని అంటున్నారు.
