Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రాజెక్టు వాక్.. నిద్రలేని రాత్రులపై భావోద్వేగం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల తీరును తెలుసుకున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Jan 2026 6:38 PM IST
చంద్రబాబు ప్రాజెక్టు వాక్.. నిద్రలేని రాత్రులపై భావోద్వేగం
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుల వాక్ మొదలైంది. బుధవారం పోలవరంతో ప్రాజెక్టుల సందర్శనను ప్రారంభించిన సీఎం త్వరలో ఉత్తరాంధ్రలోనూ పర్యటిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని వ్యాఖ్యానించారు. పోలవరం తన మనసుకు బాగా హత్తుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ‘‘పోలవరం పూర్తి కావాలి. నదులు అనుసంధానం చేయాలి. కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అనేది తన కల’’గా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల తీరును తెలుసుకున్నారు. చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ పనులను సీఎం తనిఖీ చేశారు. అనంతరం ప్రాజెక్ట్ స్థలం వద్దనే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం వైసీపీ విమర్శలు చేస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో డయాఫ్రం వాల్ ధ్వంసమైన గుర్తించలేకపోయారని సీఎం ఆరోపించారు. గతంలో డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తయ్యింటే రూ.440 కోట్లు సరిపోయేదని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల డయాఫ్రం వాల్ కోసం ప్రస్తుతం వెయ్యి కోట్లు ఖర్చుచేయాల్సివచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేదని చెప్పారు. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆరేడేళ్లు జాప్యం జరిగిందని చెప్పారు. దీనివల్ల ఖర్చులు పెరిగాయన్నారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు.

లవరం మెయిన్ డ్యాం నిర్మాణం దాదాపు పూర్తి అయిందని సీఎం తెలిపారు. ఎంబాంక్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పునరావాసం కోసం అవసరమైన భూ సేకరణ కూడా త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.అతిపెద్ద ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేయబోతున్నామని, పోలవరం కుడి, ఎడమ కాలువలు, టన్నెళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతామని సీఎం తెలిపారు.

ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుకెళ్తామని ఉమ్మడి విశాఖ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసిందని గుర్తు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. ‘‘గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లాం. అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశాం’’ అంటూ సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వ కృషి వల్ల రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కృష్ణా జలాలతో రాయలసీమలో రిజర్వాయర్లు అన్నింటినీ నింపామని, వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యమని తెలిపారు.