అమరావతి కోసం చంద్రబాబు కొత్త ప్లాన్... రిస్కే ...!
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పనులను జోరుగా చేపట్టారు.
By: Garuda Media | 6 Oct 2025 6:15 PM ISTప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పనులను జోరుగా చేపట్టారు. వర్షాకాలమైనా, వరదలు వచ్చినా కూడా పనులు సాగేలాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా నిర్మాణాలు కూడా సాగిస్తున్నారు. అయితే, ఇక్కడ 343 ఎకరాలకు సంబంధించి ప్రధాన సమస్య తెరమీదికి వచ్చింది. ఈ విషయంలో రైతులనుంచి తీవ్ర ప్రతిష్టంభన ఎదురైంది. ఇవి ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాల మధ్యలో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఎకరాలను రైతులు ప్రభుత్వానికి భూసమీకరణ(పూలింగ్) విధానంలో ఇవ్వలేదు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు చేపట్టినటువంటి నిర్మాణాల మధ్యలో ఆ భూములు ఖాళీగా ఉండడం, వాటి అవసరం ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో వాటిని ఇవ్వాలని ఇప్పటికే పదేపదే రైతులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి నారాయణ అనేక సందర్భాల్లో రైతులతో చర్చించి గతంలో రైతులకు ఏ విధంగా అయితే మేలు జరిగిందో ఇప్పుడు కూడా అదే మేలు చేస్తామని చెప్పారు. కౌలు ఇవ్వడంతో పాటు రైతులకు ఓపెన్ ఫ్లాట్లు, వాణిజ్య ఫ్లాట్లు కూడా ఇస్తామని ప్రకటించారు.
అయినప్పటికీ రైతులు 343 ఎకరాల భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవ్వని వారి నుంచి భూ సేకరణ విధానంలో భూములు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అంటే ఇక ఇప్పుడు చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకుంటారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అయితే పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే భూసేకరణ విధానంలో రైతులకు తక్షణమే నిధులను ఇవ్వాలి, వారికి కల్పించాల్సిన ప్రయోజనాలను కూడా కల్పించాలి. ప్రత్యామ్నాయంగా వేరేచోట భూములను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
మరి దీనికి సిద్ధమై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేయడం అమరావతిపై చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, మరోవైపు ఈ విధానం గనక కొనసాగితే భూ సేకరణ విధానంలో రైతులకు మేలు జరుగుతుందని కనుక అన్నదాతలు భావిస్తే భవిష్యత్తులో భూములు ఇచ్చేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం రాజధాని రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. రైతుల్లో మరింత ఎక్కువగా ఈ విషయంపై చర్చ కొనసాగుతూ ఉండడం విశేషం.
