Begin typing your search above and press return to search.

ఆహా.. అమరావతి.. రాజధానిలో ఫోర్ స్టార్ ఆతిథ్యం!

రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు నిర్మాణాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   18 Oct 2025 1:00 AM IST
ఆహా.. అమరావతి.. రాజధానిలో ఫోర్ స్టార్ ఆతిథ్యం!
X

రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు నిర్మాణాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. రాజధాని ప్రాంతంలో వసతి సమస్య లేకుండా చూసేందుకు ఆత్యాధునిక వసతులతో హోటళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. ఒకే సమయంలో రెండు పెద్ద హోటళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాజధాని అమరావతిలో ఫోర్ స్టార్ ఆతిథ్యం ఇచ్చేందుకు దసపల్లా గ్రూప్, సదరన్ గ్లోబ్ హోటల్స్ సంస్థలు సిద్దమయ్యాయి.

అమరావతిలో నాలుగు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి దసపల్లా గ్రూప్, సదరన్ గ్లోబ్ హోటల్స్ సంస్థలు ముందుకువచ్చాయి. రూ.200 కోట్లతో దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించనుంది. అదేవిధంగా రూ.177 కోట్ల వ్యయంతో సదరన్ గ్లోబ్ హోటల్ సంస్థ మరో హోటల్ నిర్మించనుంది. ఈ రెండింటి ద్వారా కొత్తగా 600 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ హోటళ్లకు పరిశ్రమల హోదా కల్పించిన ప్రభుత్వం పలు రాయితీలను కల్పించింది.

ఏపీ టూరిజం పాలసీ ప్రకారం అమరావతితోపాటు పర్యాటక ప్రాంతం అరకులో రిసార్టు నిర్మాణానికి ముందుకొచ్చిన వీఎస్కే హోటల్స్ అండ్ రిసార్ట్సుకు వంద శాతం స్టేట్ జీఎస్టీని మినహాయించింది. పదేళ్లపాటు ఈ మూడు సంస్థలు ఎస్జీఎస్టీని రీయింబర్స్ చేసుకోవచ్చు. ఇక ఫిక్సడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటులో 10 శాతం ప్రభుత్వం అందించనుంది. వంద శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పరిశ్రమల ధరకు విద్యుత్ సరఫరా చేయనుంది. అంతేకాకుండా ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకాన్ని తిరిగి చెల్లించనుంది. హోటళ్ల నిర్మాణానికి కావాల్సిన అనుమతులు సింగిల్ విండో విధానం ద్వారా జారీ చేయనున్నారు.

రాజధాని అమరావతిలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నోవోటెల్, ఐబిస్ స్టైల్ బడ్జెట్ హోటళ్ళ నిర్మాణానికి ఈ నెలలోనే భూమి పూజ జరిగింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో రాజధాని ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో సరైన హోటళ్లు లేక ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఎంత పని ఉన్నా.. రాత్రి 7 గంటలకు అమరావతిని వీడి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు వెళ్లాల్సివస్తోంది.

ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నాలుగు భారీ విద్యాసంస్థలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను కలిసేందుకు వస్తున్న తల్లిదండ్రులు ఒక రోజు విడిది చేయాలన్నా కుదరడం లేదు. విజయవాడ, గుంటూరుకు వెళ్లాల్సిరావడంతో వ్యయప్రయాసలకు లోనవుతున్నారని అంటున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణ పనులు చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. దీంతో అమరావతిలో తక్షణం హోటళ్లు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందుకే ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు ముందుకురావడంతోపాటు అనేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.