Begin typing your search above and press return to search.

అమరావతి వరద నీటి మీద అధికార ప్రకటన చేయొచ్చుగా !

అమరావతి ఏపీకి రాజధాని. ఏకైక రాజధానిగా ఉండాలని 2024 ఎన్నికల్లో జనాలు భారీ ఎత్తున ఓట్లెత్తారు.

By:  Satya P   |   18 Aug 2025 3:45 PM IST
అమరావతి వరద నీటి మీద అధికార ప్రకటన చేయొచ్చుగా !
X

అమరావతి ఏపీకి రాజధాని. ఏకైక రాజధానిగా ఉండాలని 2024 ఎన్నికల్లో జనాలు భారీ ఎత్తున ఓట్లెత్తారు. అమరావతిని ప్రపంచ రాజధాని చేయాలని తెలుగుదేశం పార్టీ కలలు కంటోంది. దాని కోసం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కసరత్తు చేస్తోంది. ఇక ఆర్థిక వనరుల ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంక్ సహా అనేక బ్యాంకులు ముందుకు వచ్చి రుణాలు ఇస్తున్నాయి. పైపెచ్చు కేంద్ర సహకారం కూడా అండగా ఉంది ఇంతటి మంచి సానుకూల వాతావరణంలో నల్లేరు మీద బండిలా నడవాల్సిన అమరావతి రాజధాని వ్యవహారం మీద ఎందుకో ఏదో రూపంలో వార్తలు రావడం వివాదాలు రేగడం అంతా చూస్తూనే ఉన్నారు.

వీడియోలతో అయోమయం :

తాజాగా చూస్తే భారీ వర్షాలతో కోస్తా ఉక్కిరిబిక్కిరి అవ్యింది. ఈ సమయంలో అమరావతి రాజధాని అంతా వరద నీటితో ఉప్పొంగుతోందని, నీటి వల్ల రాజధాని మునిగిపోతున్నాయని కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వరదనీటిలో అమరావతి అని వీడియో పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే అమరావతి విషయంలో ఏమి జరుగుతోంది అన్నది మాత్రం జనాలకు పూర్తి విషయం తెలియక అయోమయానికి గురి అవుతున్నారు. అంతే కాదు అసలు విషయం పక్కా క్లారిటీగా తెలిస్తే బాగుంటుందని ఎదురు చూసేవారూ ఉన్నారు.

ప్రభుత్వం స్పష్టత ఇవ్వొచ్చుగా :

అమరావతి రాజధాని అన్నది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి చినుకు పడితే చిత్తడి అవుతోందని వార్తలు తరచూ వస్తున్నాయి. రాజధాని నీట మునిగింది అని కూడా వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు విషయం ప్రభుత్వమే అధికారిక ప్రకటన ద్వారా తెలియచేస్తే బాగుంటుంది కదా అని అంతా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి మీద చాలా మంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దాంతో నిజమేంటి అబద్ధం ఏమిటి అన్నది జనాలకు అసలు అర్ధం కావడం లేదు అని అంటున్నారు అందుకే ఈ విషయంలో ప్రభుత్వమే ముందుకు వచ్చి ఒక స్పష్టత ఇవ్వవచ్చు కదా అని అంతా అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ సైలెంట్ ఎందుకు :

ఇక ప్రతీ ఇష్యూలో చూస్తే టీడీపీ సోషల్ మీడియా ఫుల్ చార్జితో ఉంటుంది. వైసీపీ ఒక పోస్టు పెడితే టీడీపీ నుంచి పది పోస్టులు వస్తాయి. ఒక వైపు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అమరావతి నిండా మునిగింది అని పోస్టుల మీద పోస్టులు పెడుతూంటే టీడీపీ నుంచి కనీసం ఖండించడం కూడా లేకపోవడం పట్ల చర్చ అయితే హాట్ హాట్ గా సాగుతోంది. దాంతో వైసీపీకే ఈ విషయంలో మంచి మైలేజ్ దక్కుతోంది అని అంటున్నారు.

అవి ఓల్డ్ నా లేక :

అయితే అమరావతి మునిగింది అంటూ వైసీపీ అభిమానులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ చేస్తున్న వీడియోలు పెడుతున్న పోస్టింగులు ఓల్డ్ వా లేక ఫేక్ వీడియోస్ నా అన్న చర్చ కూడా సాగుతోంది. పాతవి అయితే టీడీపీ ఈ పాటికే ఖండించి ఉండాల్సింది కదా అని అంటున్నారు. ఈ విషయంలో పార్టీ పరంగా టీడీపీ ఏమి చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వం అయితే క్లారిటీ జనాలకు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు.

మొత్తం మీద భారీ వర్షాలు తుఫాన్లు వచ్చినపుడు గతమెలా ఉన్నా ఇపుడు సోషల్ మీడియాలో మాత్రం అమరావతి రాజధాని హైలెట్ అవుతోంది. ఇలాంటి సమయాల్లో జనాలకు వాస్తవాలు ప్రభుత్వం చెబితే రానున్న రోజులలో అయినా విషయం ఇదీ అని ప్రజలకు అర్ధం అవుతుంది అని అంటున్నారు. లేకపోతే ఈ వీడియోలనే నమ్మేస్తారు అని కూడా అంటున్నారు.