ఏపీలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు!
క్యాన్సర్ కేసుల విషయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
By: Satya P | 12 Nov 2025 9:17 AM ISTక్యాన్సర్ కేసుల విషయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అంతే కాదు ప్రభుత్వం తరఫున పరీక్షలు చేయిస్తోంది. ముందస్తు పరీక్షలతో నివారణ కంటే నియంత్రణ ముఖ్యమన్న సూత్రాన్ని అనుసరిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు.
పెరుగుతున్న క్రమం :
ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ నివారణ కార్యక్రమం 4.0 ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు జరుగుతున్నాయని, మగ వారికి నోటి క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు జరిగాయని చెప్పారు. . పరీక్షలు చేయించుకున్న వారిలో బ్రెస్టు క్యాన్సర్ 9 వేల 963 మందికి ఉంటే సర్వైకల్ క్యాన్సర్ 22 వేల 861 మంది మహిళలలో అనుమానిత లక్షణాలు కలిగిన వారు ఉన్నారని చెప్పారు. అలాగే నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు కలిగిన వారు 26 వేల639 మంది ఉన్నారని డేటాని ముందుంచారు.
అలా వ్యాధి నిర్ధారణ :
ఇదిలా ఉంటే అనుమానితులుగా ఉన్న వారిని మరోమారు ఆయా ప్రాంతాల పీహెచ్ సి వైద్యులు పరీక్షలు చేసిన తరువాత అవసరమైన వారిని ఆయా జిల్లాల్లోని బోధనాసుపత్రులకు పంపుతున్నారు. అక్కడి ఆంకాలజిస్టులు మరోమారు క్యాన్సర్ అనుమానిత కేసులను పరిశీలించిన అనంతరం వారికి వ్యాధి పరిస్థితిని నిర్ధారణ చేస్తారు. తదనుగుణంగా చికిత్స మొదలవుతుంది. ఈ చికిత్స నిమిత్తం బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా 222 నెంబరుతో ఓపీ రూముని సైతం కేటాయించారు.
ప్రజలలో అవగాహన :
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో క్యాన్సర్ కేసుల విషయంలో అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇపుడు ప్రజలలో సానుకూల స్పందన లభిస్తోంది. సెప్టెంబరు 17 నుంచి ప్రారంభమైన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ నివారణ కార్యక్రమం 4.0 స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ప్రాధాన్యంపై ప్రజలలో సానుకూల మార్పు కనిపిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతున్నారు. వెల్లడించారు. ఇక రానున్న ఆరు నెలల కాలంలో మిగిలిన వారికి ఈ పరీక్షలు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ అంటున్నారు.
ఆందోళనగా ఉన్నా :
ఇదిలా ఉంటే ఏపీలో క్యాన్సర్ కేసుల విషయంలో కొంత ఆందోళన కనిపిస్తున్నా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ముందస్తుగా గుర్తించడం వల్ల్ల ప్రారంభ దశలోనే వాటిని సరైన చికిత్సతో నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఆ దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
