కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షన్, రిటైర్మెంట్ వయసు పెంపు!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు.
By: Tupaki Political Desk | 23 Jun 2026 8:55 PM ISTఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడంతోపాటు సీపీఎస్ పెన్షన్ విధానంపై సంచలన తీర్మానాలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62. దీంతో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్మెంటు వయసు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రిటైర్ అయిన వారు తిరిగి విధుల్లో చేరుతామన్నా, చేర్చుకుంటామని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే పలు రాయితీలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నం నగరాలను ప్రపంచ స్థాయి డేటా సెంటర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ డేటా సెంటర్ల ద్వారా కేవలం డిజిటల్ మౌలిక వసతులే కాకుండా, వేలాది మంది యువతకు నైపుణ్యంతో కూడిన ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
అనకాపల్లిలో 'కంట్రోల్ ఎస్', విశాఖలో 'సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్' వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్ ప్రాజెక్టులకు భూములను కేటాయించడం ద్వారా రాష్ట్రం డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలవనుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ సమావేశంలో భారీ పరిశ్రమలను ఆహ్వానించిందని చెప్పారు. నెల్లూరులో రూ. 3,678 కోట్లతో శ్యామ్ మెటాలిక్స్, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (ఐషర్ మోటార్స్) సంస్థల గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాలకు ప్రత్యేక రాయితీలను మంజూరు చేశారు. ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు వారి సొంత ప్రాంతాల్లోనే పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, మంచి వేతనాలతో కూడిన ఉపాధి పొందే అవకాశం దక్కనుంది.
ఇక ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచిన ప్రభుత్వం.. ఉద్యోగుల పెన్షన్ స్కీంపైనా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెరుగుతుందని, ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి రెండేళ్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సిపిఎస్ (CPS) ఉద్యోగులకు ఓపీఎస్ (OPS)లో వన్-టైమ్ ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాల పెన్షన్ భద్రతను బలోపేతం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి అర్హులైన ఉద్యోగులకు సిపిఎస్ నుండి ఓపీఎస్‌లోకి మారేందుకు వన్-టైమ్ ఆప్షన్ కల్పించే ఈ చారిత్రాత్మక ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ విడుదలై, ఆ తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిపిఎస్ (CPS) నుండి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో జీవో నెం. 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రూపంలో పటిష్టమైన ఆర్థిక, సామాజిక భద్రత లభించనుంది. సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు రూ. 3.39 కోట్ల మేర దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదన అమలుతో రాష్ట్ర ఖజానాపై 2026 నుంచి 2067 వరకు రూ. 34,850.83 కోట్ల నికర ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
