మంత్రి వర్గ విస్తరణకు బాబు రెడీ ?
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన జూన్ 12తో పూర్తి చేసుకుంది. మరో మూడేళ్లలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉంటాయి. అయితే చివరి ఏడాదిని అంతా ఎన్నికల ఏడాదిగానే చూస్తారు.
By: Satya P | 21 Jun 2026 12:00 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన జూన్ 12తో పూర్తి చేసుకుంది. మరో మూడేళ్లలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉంటాయి. అయితే చివరి ఏడాదిని అంతా ఎన్నికల ఏడాదిగానే చూస్తారు. దాంతో ఆ ముందు తీసుకునే నిర్ణయాలు జనంలో ప్రభావితం చేయలేవు. ఈ లెక్కన చూస్తే ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ఇదే తగిన సమయం అని అంటున్నారు. ఎందుకంటే కొత్తగా మంత్రులు అయ్యేవారి చేతిలో నికరమైన అధికారాలు ఆవకాశాలు ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే కచ్చితంగా రెండేళ్ళ పాటు ఉంటాయి. దాంతో పాలనా పరంగా రాజకీయ పరంగా కూడా అనుకున్న మార్పులను తీసుకుని వచ్చేందుకు వారికి చాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తే ఎపీలో కూటమి మంత్రి వర్గ విస్తరణకు వేళాయేనా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇవే కొలమానాలు :
మంత్రి వర్గంలో ఎవరు చేరాలన్నా లేదా ఉన్న వారిని తీసి పక్కన పెట్టాలని అన్నా కూడా కొలమానాలు ఉన్నాయి. అదే పాలనాపరమైన పనితీరుని నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా కూడా తమ సమర్ధత చాటుకోవాల్సి ఉంటుంది. కేవలం పనితీరు బాగుందని అనుకుంటే రాజకీయ వ్యూహాలలో తేలిపోరాదు. ఈ రెండూ చేయగల సమర్థులకే మంత్రి పదవులు దక్కుతాయని అంటున్నారు. జిల్లాలలో మంత్రులు తాము రాజకీయ వ్యూహ రచన చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్న వారుగా తమ శాఖల పట్ల పట్టుని నిరూపించుకుంటూ ప్రతిపక్షాన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది.
కొత్త వారితో ప్రయోగం :
ఇక చూస్తే కనుక 2024లో చంద్రబాబుతో పాటుగా చేరిన 24 మంది మంత్రులలో అత్యధికులు కొత్త వారు కావడం విశేషం. వారంతా ఒకసారి గెలిచిన వారే. కొందరు అయితే రెండు సార్లు గెలిచి వచ్చారు. అయితే కొత్త వారికి అవకాశాలు అని కూటమి ప్రభుత్వం ఒక ప్రయోగం చేసింది అని అంటున్నారు. అయితే రెండేళ్ల కాలంలో చూస్తే కనుక కేబినెట్ లో పలువురు మంత్రులు తమ పనితీరుని మెరుగుపరచుకోలేకపోతున్నారు అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు చాలా సార్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా ర్యాంకులు ఇచ్చి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కొందరు మార్చుకున్నారు, మరి కొందరు అలాగే ఉన్నారు. దాంతోనే కొందరి ఉద్వాసన తప్పదని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో సీనియర్లకు సమర్ధత కలిగిన వారికి చోటు కల్పిస్తారు అని చెబుతున్నారు.
కేంద్ర మంత్రి వర్గంతోనే :
కేంద్ర మంత్రి వర్గం త్వరలోనే విస్తరణ ఉంటుందని అంటున్నారు. జూన్ నెలాఖరులో కానీ జూలై మొదటి వారంలో కానీ మంత్రి వర్గాన్ని విస్తరించడం జరుగుతుందని అంటున్నారు. ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కేంద్ర మంత్రి పదవులు కాస్తా అయిదు లేక ఆరు అవుతాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రి పదవులు అందుకున్న వారి జాబితాను పరిశీలించి అలాగే సామాజిక ప్రాంతీయ రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం ఆ తరువాత మంత్రి వర్గ విస్తరణ చేపడుతుందని అంటున్నారు.
శ్రావణమాసమేనా :
ఇక ఆగస్టు నెలలో శ్రావణ మాసం వస్తుంది. ఆ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చు అని ప్రచారం అయితే సాగుతోంది. ఒక వేళ అలా కాదు అనుకుంటే ఆశ్వీయుజ మాసం దసరా ముందున మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తంగా ఎంచుకోవచ్చు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే కూటమి మంత్రి వర్గ విస్తరణ తప్పదని అంటున్నారు. పలువురుకి మంత్రి పదవుల గండం ఉందని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే మంత్రులుగా చేరబోయే వారి పేర్లు కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఒట్టి ఊహాగానాలే అని బాబు కనుక విస్తరణ తలపెడితే అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మరీ తనదైన శైలిలో మార్పు కూర్పు చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
