విశాఖ మంత్రులు చాలా మందేనట !
ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ లేక భారీగా మార్పులు చేర్పులు కానీ ఉంటాయా లేదు అసలు ఉండవని టీడీపీ అధికారికంగానే స్పష్టం చేసింది.
By: Satya P | 2 Aug 2025 9:01 AM ISTఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ లేక భారీగా మార్పులు చేర్పులు కానీ ఉంటాయా లేదు అసలు ఉండవని టీడీపీ అధికారికంగానే స్పష్టం చేసింది. అవన్నీ అనవసర ఊహాగానాలు అదే విధంగా చెడు ప్రచారాలు అని కూడా కొట్టిపారేసింది. అయినా సరే ఈ ప్రచారాలకు ఎక్కడా చెక్ పడడం లేదు. అంతే కాదు చాలా మంది రేసులోకి అలా దూసుకుని వచ్చేస్తున్నారు.
విశాఖ జిల్లా నుంచే :
ఒక్క విశాఖ జిల్లాలో చూస్తేనే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో టీడీపీ నుంచి చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశలు చాలానే పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన ఎపుడు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి గ్యారంటీగా దక్కించుకునేవారు. అయితే 2024లోనే లెక్క మారింది. దాంతో ఆయన వర్గం డీలా పడింది. అయితే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న వార్తలతో ఆయన వర్గీయులు ఆనందంగా ఉన్నారు తమ నేతకు కచ్చితంగా అమాత్య పీఠం దక్కుతుంది అని భావిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి సామాజిక పరంగా మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రిని తప్పిస్తారని వార్తలు వస్తున్న క్రమంలో పల్లా వర్గంలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు.
మిత్రుల ప్రయత్నాలు వేరుగా :
ఇక మిత్రపక్షం నుంచి చూస్తే బీజేపీ ఎమ్మెల్యే విశాఖ నార్త్ నుంచి రెండు సార్లు గెలిచిన విష్ణు కుమార్ రాజు తన ప్రయత్నాలలో తాను ఉన్నారు. తాను మంత్రి అవాలని ఆయన చాలా గట్టిగా భావిస్తున్నారు. ఈసారి ఆయనకు రాజకీయంగా కీలక సమయం. వచ్చేసారి పోటీకి టికెట్ దక్కుతుందో లేదో తెలియదు దాంతో మంత్రి అనిపించేసుకుంటే తన రాజకీయానికి అర్ధం పరమార్ధం దక్కుతాయని ఆయన భావిస్తున్నారుట. అలాగే పెందుర్తికి చెందిన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఆశగా చూస్తున్నారు. ఆయన ఒకప్పుడు గంటా బ్యాచ్ లోని వారే. గంటా అనుచరులుగా ఉంటూ అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు తాను కూడా అయి తీరాల్సిందే అన్నది ఆయన ఆలోచనట. పైగా సామాజిక వర్గ సమీకరణలు ఆయనకు కలిసి వస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మరింతమంది :
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు మంత్రి పదవి అని అంటున్నారు ఆయన అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సామాజిక వర్గం దన్ను ఉంది. పైగా పదిహేనేళ్ళుగా గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఆ సామాజిక వర్గం ఉంటుంది దాంతో తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక అనూహ్యంగా రేసులోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా దూసుకుని వచ్చారని అంటున్నారు. ఆయన స్పీకర్ పదవిని త్యగ్జించి మంత్రిగానే రాజకీయ జీవితం ముగించాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.
అదే విధంగా మాడుగులకు చెందిన మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఒక్క చాన్స్ అంటున్నారు. ఆయన కూడా మంత్రి పదవిని కోరుతున్నారు. ఇలా చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. వీరు కాక మంత్రి అయితే బాగుంటుందని విశాఖ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామక్రిష్ణబాబు గణబాబు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చెరి నాలుగేసి సార్లు ఎమంల్యేలుగా నెగ్గిన అనుభవం కలిగిన వారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమిలో నూటికి తొంబై శాతం మంది ఎమ్మెల్యేలు మంత్రి సీటు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. మరి నిజంగా విస్తరణ ఉంటుందా ఉంటే ఎవరికి చాన్స్ దక్కుతుంది అన్నదే చూడాల్సి ఉంది మరి.
