తలతిప్పి చూడకుండా.. లోకేష్ సరికొత్త సంప్రదాయం.. !
మండలిలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పక్షాలు కూడా ఎక్కువగా మండలిపైనే దృష్టి పెట్టాయి.
By: Garuda Media | 13 Feb 2026 5:48 PM ISTఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు.. శాసన మండలిలోనే మంత్రులు ఎక్కువ సమయం గడిపారు. శాసన సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఎటు చూసినా.. అధికార కూటమి పార్టీలకు చెందిన సభ్యులే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారే ప్రశ్నిస్తుండగా.. ఆపార్టీలకు చెందిన మంత్రులే సమాధానం చెబుతున్నారు. కానీ, శాసన మండలికి వస్తే.. మాత్రం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది.
మండలిలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పక్షాలు కూడా ఎక్కువగా మండలిపైనే దృష్టి పెట్టాయి. ఫలితంగా ఇప్పుడు లైవ్ ప్రసారం కూడా మండలిలోనే ఎక్కువగా ఉంది. వాస్త వానికి ఒకప్పుడు అసెంబ్లీలో ఏం జరిగిందో చర్చించుకునేందుకు నాయకులు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ .. గత కొన్నాళ్లుగా మండలి విషయాలనే చర్చించుకుంటున్నారు. ఇక, మండలిలో వైసీపీ సభ్యులు కూడా బలంగానే వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది.
దీంతో వైసీపీ సభ్యులకు అంతే బలంగా అధికార కూటమి నేతలు, మంత్రుల నుంచి సమాధానం లభి స్తోంది. అయితే.. ప్రత్యర్థి పక్షం.. ఏదైనా ప్రశ్న సంధిస్తే.. సమాధానం ఇచ్చేందుకు మంత్రులు.. వారివైపు చూస్తూ.. సమాధానం చెప్పేవారు. అదేసమయంలో అధ్యక్ష పీఠంలో ఉన్నవారి వైపు కూడా తరచుగా చూస్తూ సమాధానం ఇచ్చేవారు.కానీ.. తాజాగా ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ట్రెండ్ మార్చేశారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన వైసీపీ సభ్యుల నుంచి వచ్చిన ప్రతిప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
కానీ, ఎక్కడా కూడా వైసీపీ సభ్యుల వైపు కన్నెత్తి చూడలేదు. వారు ప్రశ్నించిన సమయంలోనూ.. వారికి సమాధానం ఇస్తున్న సమయంలోనూ మంత్రి లోకేష్ కనీసం వైసీపీ సభ్యుల వైపు కన్ను సారించలేదు. పూర్తిగా ఆయన మండలి చైర్మన్ వైపే చూస్తూ.. సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు ఆశ్చర్య పోయారు. సహజంగా తమవైపు చూస్తారని ఆశించిన వరదు కల్యాణ్, మాధవరావు వంటివారు లోకేష్ తమవైపు చూడకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా.. నారా లోకేష్ కొత్త సంప్రదాయానికి తెరదీశారా? అనే చర్చ సాగుతోంది.
