బీజేపీ మాధవుడి యాత్రా స్పెషల్
ఏపీలో బీజేపీకి బీసీ నేతగా యువకుడిగా సమర్ధ నాయకత్వం అందిస్తారని భావిస్తూ గత ఏడాది కేంద్ర నాయకత్వం ఏపీ బాధ్యతలు అప్పగించింది.
By: Satya P | 3 Jan 2026 9:23 AM ISTఏపీలో బీజేపీకి బీసీ నేతగా యువకుడిగా సమర్ధ నాయకత్వం అందిస్తారని భావిస్తూ గత ఏడాది కేంద్ర నాయకత్వం ఏపీ బాధ్యతలు అప్పగించింది. అలా విశాఖకు చెందిన పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన తక్కువ మాట్లాడుతారు, విమర్శలు కూడా తక్కువ చేస్తారు. పార్టీని బలోపేతం చేయడం మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఇతర పార్టీ నేతల మాదిరిగా ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయకుండా పార్టీని జనాలకు ఎలా మరింతగా చేరువ చేఅయాలన్న దాని మీదనే ఫోకస్ పెట్టారు. అందులో భాగమే ఏపీలో వాజ్ పేయి విగ్రహాల ఏర్పాటు.
క్రెడిట్ తన ఖాతాలో :
దేశంలో ఏ రాజకీయ పార్టీ విభేదించని ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి, దేశానికి సంకీర్ణ పాలనను పరిచయం చేస్తూ ఆరున్నరేళ్ళ పాటు పాలించారు. ఆయన మరణించి ఏడేళ్ళు అవుతున్నా ఎక్కడా ఆయన విగ్రహాలు అయితే పెద్ద ఎత్తున లేవు, ఏపీలో మాత్రం ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేయించిన ఘనతను మాధవ్ అందుకున్నారు. ఆయన తన ఆలోచనలతో వాజ్ పేయ్ విగ్రహాల ఏర్పాటునే కాకుండా బీజేపీ సుపరిపాలన అంటూ జనంలో కాషాయం పార్టీని మరింత దగ్గరగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కొంత మేర విజయం సాధించారు బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం మాధవ్ ఆలోచనలను మెచ్చుకుంది అని అంటున్నారు.
జీ రాం జీ అంటూ :
ఇపుడు మాధవ్ మరో కీలక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జీ రాం జీ చట్టం గురించి ఏపీ వ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు ఆయన యాత్రను చేపడుతున్నారు. ఏపీలోని మొత్తం అన్ని జిల్లాలలో సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా కొత్త చట్టం ద్వారా ప్రజలకు కలిగే మేలు ఏమిటి శ్రామిక జనులకు గతానికి కంటే ఎక్కువగా కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది వివరించాలని చూస్తున్నారు. గతంలో ఉన్న 100 పని దినాల కంట ఎక్కువగా 125 పని దినాలను కేంద్రం ఈ చట్టం ద్వారా అందిస్తోందని ఇది ఎంతగానో మేలు చేసేది అంటూ ఆయన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.
విమర్శలకు చెక్ :
ఈ పధకం మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం జాతీయ ఉపాధి హామీ పధకానికి గండి కొడుతోందని అందుకే ఇలా చట్ట సవరణ చేసింది అని కూడా అంటున్నాయి. వాటన్నింటికీ ఈ యాత్ర ద్వారా పీవీఎన్ మాధవ్ జవాబు చెబుతారు అని అంటున్నారు. తొందరలోనే దీనిని ప్రారంభిస్తారు అని అంటున్నారు. మరోసారి కేంద్ర మంత్రులు జాతీయ నేతలను ఏపీకి రప్పించి మాధవ్ చేయబోతున్న ఈ యాత్ర ద్వారా బీజేపీని బలోపేతం చేయాలని కూడా చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మాధవ్ యాత్రా స్పెషల్ తో తన మార్క్ పాలిటిక్స్ ని ఏపీకి చూపిస్తున్నారు అని అంటున్నారు.
