మాధవా...మన సంగతేంటి ?
ఏపీ బీజేపీ నేతలు అంతా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా తమ పార్టీ కూడా మంచి సంఖ్యలో సీట్లు సాధించాలని చూస్తున్నారు.
By: Satya P | 13 Aug 2026 9:21 AM ISTఏపీ బీజేపీ నేతలు అంతా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా తమ పార్టీ కూడా మంచి సంఖ్యలో సీట్లు సాధించాలని చూస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మాధవ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయింది. దీంతో ఏడాది పదవి మీద పార్టీ నేతలు అంతా వేడుక చేశారు. అలాగే తాజాగా ఆయన పుట్టిన రోజుని కూడా ఘనంగా జరిపారు. ఇక పార్టీ అధినేత ముందు నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాటా ఎంతో తేల్చాలని వారు కోరుతున్నారు. కూటమిలో బీజేపీకి లోకల్ బాడీ ఎన్నికల సర్దుబాటులో అయిదు శాతం సీట్లే ఇస్తారు అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కమలం పార్టీలో కలవరం రేగుతోంది.
నామినేటెడ్ పోస్టులలోనూ :
ఇప్పటికే ఏపీలో నామినేటెడ్ పదవులలో తీరని అన్యాయం జరిగింది అని బీజేపీ నేతలు వాపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తమకు చాన్స్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా వారు ఉన్నారు. అయిదు శాతం అంటే పార్టీలో ఆశావహులు అంతా నష్టపోతారని అంటున్నారు. కనీసం పది నుంచి పదిహేను శాతం అయినా సీట్లు కేటాయిస్తేనే మేలు అని వారు సూచిస్తున్నారు. ఈ విషయం మీద కూటమి పెద్దలతో మాట్లాడాలని అధ్యక్షుడు మాధవ్ ని కోరుతున్నారు.
బలం పెంచుకోవాలని :
అయితే దీని మీద మాధవ్ మాత్రం క్యాడర్ కి నాయకులకు కీలక సూచనలే చేశారు పార్టీని ముందు బూత్ లెవెల్ దాకా బలోపేతం చేయాలని ఆయన కోరారు. పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ సీట్లు ఎక్కువ కోరుదామన్నది అధినాయకత్వం మనోగతంగా ఉంది అని అంటున్నారు. అయితే దీని మీదనే పార్టీలో చర్చ సాగుతోంది. కూటమిలో బీజేపీకి తగిన వాటా ఇస్తే అన్ని పార్టీల మద్దతుతో పొత్తు వల్ల సులువుగా గెలుచుకోవచ్చు అన్నది నేతల ఆలోచనగా చెబుతున్నారు. అలా కాకుండా పార్టీ బలోపేతం అని ఎక్కడ బలంగా ఉందో అని చర్చ కనుక వస్తే బీజేపీకి వచ్చే సీట్లు పెద్దగా ఏమీ ఉండవని అంటున్నారు. అందువల్ల డిమాండ్ చేయాల్సింది రాష్ట్ర అధినాయకత్వమే అని చెబుతున్నారు.
జనసేనను చూసి అయినా :
ఇక ఏపీలో జనసేనకు నామినేటెడ్ పదవులు బాగానే దక్కాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు అలాగే 15 శాతం సీట్లు స్థానిక ఎన్నికల్లో ఇస్తామని అంటే ఆ పార్టీ నేతలు గట్టిగానే వ్యతిరేకించారు అని అంటున్నారు. కనీసం ముప్పయి శాతం సీట్లు అయినా సర్దుబాటులో జనసేనకు దక్కాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. మరి బీజేపీకి అయిదు శాతం సీట్లు అంటే కమలం పార్టీ నుంచి పెద్దగా గొంతు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదని కూడా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే వచ్చే సీట్లు ఏమీ ఉండవని పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీకి చెందిన ఆశావహులు అయితే పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థలలో పోటీకి తయారుగా ఉన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో కూటమి పెద్దలతో మాట్లాడి సానుకూలంగా చేయాలని వారు అంటున్నారు. మరి మాధవ్ ఏ మేరకు ఈ సీట్ల పేచీని తేలుస్తారు అన్నదే చూడాల్సి ఉంది.
