Begin typing your search above and press return to search.

ఆది వ‌ర్సెస్ ర‌మేష్‌: క‌మ‌లంలో కుంప‌టి..!

ఏపీ బీజేపీ పార్టీలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల విష‌యంలో రోజు రోజుకు వివాదాలు పెరుగుతున్నాయి.

By:  Garuda Media   |   27 Sept 2025 7:00 AM IST
ఆది వ‌ర్సెస్ ర‌మేష్‌: క‌మ‌లంలో కుంప‌టి..!
X

ఏపీ బీజేపీ పార్టీలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల విష‌యంలో రోజు రోజుకు వివాదాలు పెరుగుతున్నాయి. అయితే.. ఇద్ద‌రూ కూడా మాజీ టీడీపీ నాయ‌కులే కావ‌డం.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు కావ‌డం... రాజకీయంగా ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లు కావ‌డంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఆస‌క్తిని పెంచుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానం నుంచి సీఎం ర‌మేష్ విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఈయ‌నకు చెందిన రిత్విక్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ క‌డ‌ప కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఇక్క‌డ ప‌లు కాంట్రాక్టులు ద‌క్కించుకుంది.

ఇక‌, క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆదినారాయ‌ణ రెడ్డికి ప్ర‌త్యేకంగా వ్యాపారాలు.. నిర్మాణ కంపెనీలు లేక‌పోయినా.. ఆయ‌న ధోర‌ణి ఆయ‌న‌ది. ఆయ‌న బంధువు ల‌తో రియ‌ల్ ఎస్టేట్ స‌హా.. ఇత‌ర నిర్మాణ కంపెనీలు పెట్టించి వాటిని ప్రోత్స‌హిస్తున్నారు. అయితే.. క‌డ‌ప‌లో త‌న‌కు తెలియ‌కుండానే ప‌నులు చేస్తుండ‌డం.. త‌న వారికి ద‌క్కాల్సిన కాంట్రాక్టుల‌ను కూడా సీఎం ర‌మేష సొంతం చేసుకోవ‌డం వంటివి ఆదికి ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. దీంతో ఇద్ద‌రూ ఒకే పార్టీకి చెందిన వారే అయినా.. రాజ‌కీయంగా ర‌చ్చ‌కు దిగుతున్నారు.

గ‌త నాలుగు మాసాల కిందట‌.. కాంట్రాక్టు త‌మ‌కు ద‌క్క‌లేద‌ని, త‌మ‌కు కూడా వాటా కావాల‌ని పేర్కొంటూ.. రిత్విక్ సంస్థ‌పై ఆది వ‌ర్గీయులు దాడి చేశారు. ఇది అప్ప‌ట్లో పెనుదుమారం రేపింది. తాజాగా జ‌మ్మ‌ల‌మ డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ప్రాతంలో రిత్విక్ కంపెనీ చేప‌ట్టిన ప‌నుల‌ను అడ్డుకున్నారు. దీనికి కార‌ణం.. ఇక్క‌డి వారికి న్యాయం చేయ‌లేద‌ని.. పైగా.. ప‌నులు మాత్రం య‌ధాప్ర‌కారం చేసుకుంటున్నార‌ని ఆది వర్గం ఆరోప‌ణ‌లు చేస్తోంది. అందుకే.. రిత్విక్ కంపెనీని అడ్డుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. అటు ఆది, ఇటు సీఎం ర‌మేష్ ఇద్ద‌రూ ఒకే పార్టీలో ఉంటూ.. త‌మ వ్యాపారాల కోసం యాగీ చేసుకోవ‌డం.. రోడ్డున ప‌డి ర‌చ్చ చేసుకుంటున్న క్ర‌మంలో బీజేపీ ఏం చేస్తోంద‌న్న‌ది ప్ర‌శ్న‌. నిజానికి ఇలాంటి వివాదాలు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు పార్టీప‌రంగా స్పందించాల్సి ఉంటుంది. వారిని కూర్చోబెట్టి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించాలి. కానీ.. ఆ ప్ర‌య‌త్నం ఎక్క‌డా సాగ‌డం లేదు. దీనికి కార‌ణం.. సీఎం ర‌మేష్‌కు కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు.. ఆదికి స్థానికంగా ఉన్న బ‌లం వంటివేన‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ వివాదాల‌ను ఎవ‌రు కంట్రోల్ చేస్తారు? ఎప్పుడు కంట్రోల్ అవుతాయి? అనేవి చూడాలి. ..!