ఏపీ బీజేపీకి నబీన్ మార్క్ క్లాస్ !
ఏపీ బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది అన్న విమర్శలు ఉన్నారు. ఎవరు సారధ్యం వహించినా అలాగే సీన్ కనిపిస్తోంది.
By: Satya P | 19 Aug 2026 9:25 AM ISTఏపీ బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది అన్న విమర్శలు ఉన్నారు. ఎవరు సారధ్యం వహించినా అలాగే సీన్ కనిపిస్తోంది. ఏ మాత్రం ఎత్తి గిల్లడం లేదు, అధికారంలో ఉన్నా కూడా తమ బలాన్ని పెంచుకోలేకపోతోంది. దాంతో జాతీయ నాయకత్వం అయితే కొంత అసంతృప్తితో ఉంది అంటున్నారు. బీజేపీకి బలం పరిమితంగా ఉంటోంది. పొత్తులు ఉంటే గెలుస్తోంది, లేకపోతే డిపాజిట్లు తెచ్చుకోవడం కష్టం అవుతోంది. ఈ రోజున ఏపీ అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, అలాగే కేంద్రంలో ముగ్గురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు అంటే అదంతా పొత్తు మహిమ అని ఎవరైనా చెప్పేస్తారు. మరి సొంతంగా బలం పెంచుకునేది ఎపుడు అన్నదే జాతీయ నాయకత్వం అంతర్మధనంగా ఉంది.
పట్టు సాధించకుండా :
బీజేపీ ఎక్కడా పట్టు సాధించలేని స్థితిలో ఉంది. కొత్తగా పెట్టిన జనసేన కూడా కొన్ని ప్రాంతాలలో తమకు ఓటు బ్యాంక్ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం ఫలానా చోట్ల గట్టిగా ఓట్లు తెచ్చుకోగలమని చెప్పలేకపోతోంది. ఇదే జాతీయ నాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్నగా ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులను ప్రెసిడెంట్ చేసినా కమ్మ సామాజిక వర్గం నుంచి హరిబాబు పురంధేశ్వరిలను అధ్యక్షులుగా చేసినా బీసీ సామాజిక వర్గం నుంచి పీవీఎన్ మాధవ్ కి చాన్స్ ఇచ్చినా కూడా బీజేపీ పరిస్థితిలో మార్పు అయితే లేదు. కొత్తగా ఒక్క ఓటు సంపాదించలేకపోతోంది అని అంటున్నారు.
చేరికలు ఏవీ :
ఏపీలో ఎక్కువగా చేరికలు టీడీపీలో జరిగాయి. ఆ తరువాత ఎంతో కొంత జనసేన కూడా లాభపడుతోంది. కానీ అధికారంలో ఉండి కూడా బీజేపీలో చేరికలు ఎందుకు లేవు అన్న ప్రశ్నలకు జవాబు అయితే లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాయలసీమలో కూడా బీజేపీ ఎమ్మెల్యే సీట్లు సాధించింది. అనంతపురం ధర్మవరం నుంచి సత్య కుమార్ యాదవ్ గెలిచి మంత్రి అయ్యారు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా బీజేపీ నుంచి ఒక డాక్టర్ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే మరో చోట బీజేపీ జెండా పాతింది. కానీ సీమ నుంచి బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లను పార్టీ వైపుగా ఆకర్షించలేకపోతున్నారు అని అంటున్నారు.
మంత్రులు ఉన్నా కూడా :
బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి శ్రీనివాసవర్మ మంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్ర కేబినెట్ లో సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక ఏపీ కోటా నుంచి రాజ్యసభకు బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు చాన్స్ ఇచ్చారు. మరి ఈ సమీకరణలు ఏవీ బీజేపీ బలపేతానికి పనిచేయలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. తెలంగాణా బీజేపీలో ఎంతో మంది నాయకులు కనిపిస్తారు. అక్కడ గడచిన ఎన్నికల్లో రెండు పదుల ఓటు షేర్ దక్కింది. ఎంపీలు ఎనిమిది మంది గెలిచారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందతా బీజేపీ సొంతంగా చేసిన పోరాటం ఫలితంగానే జరిగింది అని గుర్తు చేస్తున్నారు. ఏపీలో ఆ స్థాయిలో కాకపోయినా కీలక నేతల నియోజకవర్గాలలో అయినా పటిష్టంగా ఉందా అంటే జవాబు అందరికీ తెలిసిందే అని అంటున్నారు.
జనంలోకి వెళ్ళండి :
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలి సారి ఏపీ టూర్ కి వచ్చారు. విశాఖ వేదికగా నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేసం చేశారు. ప్రజల్లో నిరంతరం మమేకం కావాలని కోరారు. అంతే కాదు పార్టీ కార్యకర్తలతో అనుసంధానం కావాలని సూచించారు ఈ రెండూ చేస్తేనే పార్టీ బాగు పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది అని అన్నారు. వాటిని జనంలోనికి తీసుకుని పోవాల్సిన బాధ్యత పార్టీదే అని అన్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్నది గుర్తించి వారి ఆలోచనలకు తగిన విధంగా పనిచేయాలని కోరారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని కూడా కోరారు. మొత్తం మీద చూస్తే సంస్థాగతంగా ఏపీ బీజేపీ బాగుపడాలన్న ఆరాటం అయితే జాతీయ నాయకత్వంలో కనిపించింది.
