Begin typing your search above and press return to search.

బీజేపీకి ఇచ్చినవి దక్కించుకోవడమేనా ?

ఇదిలా ఉంటే ఏపీలో మిత్రులకు ఇరవై శాతం సీట్లు ఇచ్చి ఎనభై శాతం సీట్లలో పోటీ చేయాలని టీడీపీ పెద్దలు అనుకుంటున్నారు అని ఆ మధ్యన ప్రచారం అయితే సాగింది.

By:  Satya P   |   1 Oct 2026 10:00 AM IST
బీజేపీకి ఇచ్చినవి దక్కించుకోవడమేనా ?
X

ఏపీ బీజేపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది కానీ వాయిస్ మాత్రం సన్నగానే వినిపిస్తోంది. కూటమిలో రెండవ స్థానంలో కీలకంగా జనసేన ఉంది. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇక జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. పవన్ వంటి ఇమేజ్ ఉన్న నాయకుడు ఆ పార్టీకి అతి పెద్ద అండగా ఉన్నారు. పైగా జనసేనకు ఏపీలో ఓటు షేర్ ఎక్కువ. ఒక బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ వెంట ఉంది. దీంతో పాటు ఎప్పటికైనా రాజ్యాధికారం అందుకోవాలన్న ఆకాంక్ష జనసేనకు ఉంది. అందుకే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక మంచి అవకాశంగా చూస్తోంది. దాంతో ఎక్కువ సీట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ముప్పయి శాతం సీట్లు తమకు ఇవ్వాలని జనసేన గట్టిగా అనగలుస్తోంది. అదే పెద్ద గొంతును మరో మిత్ర పక్షం అయిన బీజేపీ వినిపించ లేకపోతోంది అని అంటున్నారు.

భారం అంతా వారిదే :

ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అంటున్నారు. బీజేపీకి ఎంపీలు ముఖ్యం. అలాగే తమకు ఏపీలో బలం పెరగాలి అంటే ఎమ్మెల్యేలు కూడా ముఖ్యం. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో అయితే నేరుగా జాతీయ నాయకత్వం ముందుకు వచ్చి చర్చలు జరుపుతుంది. కానీ లోకల్ బాడీస్ ఎన్నికలు కాబట్టి ఏపీ నాయకత్వం మీదనే బాధ్యతలను భారాన్ని మోపింది అని అంటున్నారు. గత నెలలో విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అయితే స్థానికంగా కూడా బీజేపీ బలపడాలని దిశా నిర్దేశం చేసి వెళ్లారు. అందువల్ల వీలైనంత ఎక్కువగా సీట్లు తీసుకఒవాలని సూచించారు. దాంతో ఏపీ నాయకత్వమే ఈ విషయంలో కూటమిలో తేల్చుకోవాల్సి ఉందని అంటున్నారు.

ఎన్ని సీట్లు ఇస్తారంటే :

ఇదిలా ఉంటే ఏపీలో మిత్రులకు ఇరవై శాతం సీట్లు ఇచ్చి ఎనభై శాతం సీట్లలో పోటీ చేయాలని టీడీపీ పెద్దలు అనుకుంటున్నారు అని ఆ మధ్యన ప్రచారం అయితే సాగింది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ పదిహేను శాతం సీట్లు జనసేనకు అయిదు శాతం సీట్లు బీజేపీకి ఇస్తారు అన్నది అయితే వైరల్ న్యూస్ అయింది. దీని మీద జనసేన తన గొంతు పెంచింది. అలా కుదరదు ముప్పయి శాతం సీట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ వస్తోంది. దాంతో జనసేనకు ఎన్ని ఇస్తారు అన్నది పక్కన పెడితే ఎక్కువే దక్కుతాయని అంటున్నారు. అదే సమయంలో అయిదు శాతం బీజేపీకి అన్న దాని మీద ఏపీ కమలనాధులు అయితే ఇప్పటిదాకా నోరు విప్పలేదని గుర్తు చేస్తున్నారు.

సర్దుకుపోవడమేనా :

ఏపీ బీజేపీకి క్షేత్ర స్థాయిలో పెద్దగా బలం లేదన్నది తెలిసిందే. కూటమి పొత్తులతోనే సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఒక వేళ ఎక్కువ సీట్లు ఇచ్చినా అక్కడ ఓటు బదిలీ అన్నది ఇతర పార్టీల నుంచి జరగకపోయినా బీజేపీ గట్టిగా నిలబడకపోయినా వైసీపీకి చాన్స్ దక్కుతుంది. దాంతో బీజేపీ విషయంలో బలమెంత ఎక్కడ ఏమిటి అన్నది కూటమి పెద్దల వద్ద కచ్చితమైన సమాచారం ఉందని అంటున్నారు. దాంతో బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఇస్తారని అంటున్నారు. అలా మిత్ర ధర్మం ప్రకారం దక్కే సీట్లలో సర్దుకుని పోటీ చేయడమే కమలం పార్టీ కర్తవ్యం అని అంటున్నారు. ఇక బీజేపీకి చెందిన ఏపీ నాయకత్వం కూడా పెద్దగా పట్టుబట్టే అవకాశాలు ఈ విషయంలో లేవనే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ బీజేపీ పరిస్థితి ఇచ్చునమ్మ వాయినం పుచ్చుకున్న వాయనం అన్నట్లుగానే ఉండబోతోంది అంటున్నారు. విశాఖ మేయర్ వంటి వాటిని కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నా అంతిమంగా ఎక్కడ ఏమి ఇస్తారు అన్నది కూటమి పెద్దల ఇష్టమే అని అంటున్నారు.