సింగపూరులో మెరిసిన ఏపీ బంగినపల్లి
ఏపీలోని రైతుల నుంచి ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ సంస్థ బంగినపల్లి మామిడి పండ్లను జూన్ 11న ఎగుమతి చేయగా సముద్ర మార్గం ద్వారా అవి ఈ నెల 24న సింగపూర్ తీరానికి చేరుకున్నాయి.
By: Satya P | 26 Jun 2026 8:00 AM ISTబంగినపల్లి మామిడి పళ్ళు అంటే ఎంత తీపిగా ఉంటాయో ఏపీ జనాలకు బాగా తెలుసు. ఆ మధుర ఫలాలను ఆస్వాదించిన జనాలకు వాటి రుచి ఏమిటో ఇంకా బాగా తెలుసు. మనది అని గొప్పగా గర్వంగా చెప్పుకునే బంగినపల్లి మామిడిని సింగపూర్ కి ఎగుమతి చేశారు. అది కూడా సముద్ర మార్గం ద్వారా. దాంతో ఏపీ బంగినపల్లి దేశాలు దాటి వెళ్ళి ఏపీ ఖ్యాతిని మరింతగా పెంచుతోంది అని చెప్పాల్సి ఉంది. ఏపీలోని మామిడి రైతుల నుంచి అయిదు మెట్రిక్ టన్నుల బంగినపల్లి మామిండిని సేకరించి మరీ ఎగుమతి చేశారు.
డబుల్ అయిన ఆదాయం :
ఏపీలోని లోని కర్నూలు జిల్లాకు చెందిన ప్రసిద్ధ బంగినపల్లి మామిడి పండ్లను తొలిసారిగా సముద్ర మార్గం ద్వారా సింగపూర్‌కు విజయవంతంగా ఎగుమతి చేశారు. ఈ విధంగా మామిడి రైతుల పంటకు రెట్టింపు లాభం ఆదాయం దక్కిందని అంటున్నారు. పైగా సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడం ద్వారా ఖర్చులు కూడా ఇంకా తగ్గుతాయని అంటున్నారు. రవాణా ఖర్చులు కేజీకి సుమారు రూ 13 నుంచి 20 దాకా భారీగా తగ్గాయి. ఇక ఏపీ మామిడి పండ్ల నాణ్యతకు రుచికి సింగపూరులోని దిగుమతి దారుల నుంచి మంచిగానే కితాబు లభిస్తోంది. ఒక విధంగా చూస్తే సింగపూర్ కి పంపిన బంగిన పల్లి మామిడి ఏపీలోని వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త రూపు ఇచ్చిందని అంటున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం :
ఈ విధంగా సముద్ర రంగం ద్వారా రవాణాతో ఏపీలోని వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఊతం లభించింది అని అంటున్నారు. ఇక ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా విమాన మార్గం ద్వారా ఎగుమతి చేసేవారు. ఇపుడు కొత్తగా సముద్ర మార్గం అందుబాటులోకి రావడంతో ఎగుమతిదారులకు ఇది పూర్తిగా లాభదాయకంగా మారింది. సముద్ర మార్గం ద్వారా పండ్లు పాడవకుండా తాజాగా ఉండేందుకు ప్రత్యేక శీతల గిడ్డంగుల కంటైనర్లను ఉపయోగించారు. సముద్ర రవాణా ఖర్చులు తగ్గడం వల్ల సింగపూర్ మార్కెట్లలో వినియోగదారులకు మరింత సరసమైన ధరలలో ఏపీ మామిడి పండ్లు లభిస్తున్నాయి. ఈ ఎగుమతులను వ్యవసాయ శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఎపెడా సంగ్రంగా పర్యవేక్షించింది.
నాణ్యతకు కితాబు :
ఏపీలోని రైతుల నుంచి ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ సంస్థ బంగినపల్లి మామిడి పండ్లను జూన్ 11న ఎగుమతి చేయగా సముద్ర మార్గం ద్వారా అవి ఈ నెల 24న సింగపూర్ తీరానికి చేరుకున్నాయి. ఈ మొత్తం ప్రోసెస్ ని అంతా సక్సెస్ ఫుల్ గా నడిపించింది లక్నోలోని ఐకార్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ గా చెబుతున్నారు. అలాగే కీలక పాత్ర పోషించింది. అలాగే సింగపూర్‌లో ఈ పండ్లను దిగుమతి చేసుకున్న ఈసీ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయితె ఏపీ బంగినపల్లి మామిడి పళ్ళ నాణ్యత అద్భుతంగా ఉందని ప్రశంసించడం విశేషం.
షాపీ సింగపూర్ లో :
ఇపుడు ఏపీ బంగినపల్లి షాపీ సింగపూర్ లో ఆన్ లైన్లోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే సింగపూర్‌లోని స్థానిక మార్కెట్లలో కూడా విక్రయిస్తునారు. ఈ మామిడి పండ్లు ఎటువంటి కార్బైడ్ లేకుండా సహజ పద్ధతిలో పండించినవి కావడంతో మంచి డిమాండ్ అక్కడ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఈ తరహాలో వివిధ రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి ప్రోత్సాహం ఇస్తోంది. ఇక సింగపూర్ కి ఏపీ మామిడి పండ్లు ఎగుమతి అన్నది కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి రంగంలో ఒక కీలక మైలురాయిగా చెబుతున్నారు.
