ఆటో డ్రైవర్ లుక్ లో బాబు, పవన్, లోకేష్... పిక్స్ వైరల్!
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By: Raja Ch | 4 Oct 2025 3:04 PM ISTఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ సింగ్ నగర్ లోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.
అవును... ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలో... తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఈ పథకం వల్ల 2.64 లక్షల మంది ఆటో డ్రైవర్లకు, 20,072 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. అర్హులై ఉండి ఈ పథకం అందనివారి ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఆటో డ్రైవర్స్ లుక్ లో నేతలు..!:
ఈ కార్యక్రమం సందర్భంగా... ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్ నగర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ బయల్దేరారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కీలక వ్యక్తులు ఆటో డ్రైవర్ యూనిఫాంలో కనిపించారు. దానితో పాటు ఆటో డ్రైవర్లతో కలిసి కూర్చుని వారితో సంభాషించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు.... ఆటో డ్రైవర్లలో చాలా మంది పేద వాళ్లే ఉంటారని, వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తే కొంత ఊరటగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో... గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గతుకులే గతుకులని, ఆ గతుకుల రోడ్లతో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారని.. అయితే, మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వమని అన్నారు.
