అసెంబ్లీకి జగన్ వస్తే...అరుదైన సన్నివేశాలే !
మన ప్రజాస్వామ్యానికి రెండు చక్రాలు అధికార విపక్షాలు అని చెబుతారు. అధికార పక్షం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
By: Satya P | 26 Aug 2025 8:00 AM ISTమన ప్రజాస్వామ్యానికి రెండు చక్రాలు అధికార విపక్షాలు అని చెబుతారు. అధికార పక్షం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ జవాబులను రాబట్టే నిర్మాణాత్మకమైన పాత్రను విపక్షం సమర్ధంగా పోషించాలి. అపుడే చట్ట సభలకు ఒక అర్ధం. అందం కూడా. కానీ చాలా చోట్ల ఈనాటి కాలంలో అలా జరగడం లేదు. అసెంబ్లీలలో అధికార పక్షాలు తమ సంఖ్యాబలాన్ని చూపిస్తున్నాయి. విపక్షాలు తమ గొంతు నొక్కుతున్నారంటూ బహిష్కరిస్తున్నాయి.
పావు కాలం పూర్తి అయింది :
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడచాయి. అంటే మొత్తం అరవై నెలల అధికారంలో పావు కాలం పూర్తి అయింది అన్న మాట. ఇపుడు సభలోకి ఎంటర్ కావాలని జగన్ నిర్ణయించుకున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనంలో వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఎక్కువగా ఉందని నమ్ముతున్న వైసీపీ ఆ ధైర్యాన్ని నిండా ఉంచుకుని సభలోకి అడుగుపెట్టనుంది అని చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ధాటీగా విమర్శించడానికి ఇదే సరైన సమయం అని కూడా భావిస్తోంది.
జగన్ కి మైకు దక్కేనా :
అయితే ఏపీ అసెంబ్లీలో చిత్రమైన వాతావరణం ఉంది అని అంటున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో 164 మంది కూటమికి చెందిన వారే ఉన్నారు. దాంతో కేవలం 11 మందితో వైసీపీ చాలా పలుచగా ప్రతిపక్షం బెంచీల వైపు ఉండనుంది. ఇది కంటికి కనిపించే సన్నివేశం అయితే విపక్ష హోదా అన్నది వైసీపీకి లేదు. దాంతో జగన్ సైతం ఒక సాధారణ ఎమ్మెల్యే కిందనే లెక్కగా పరిగణిస్తారు. ఆయన తమ పార్టీ తరఫున సభా పక్ష నాయకుడు కానీ మొత్తం సభకు ప్రతిపక్ష నాయకుడు కాదని శాసనసభ నియమావళి తెలియచేస్తోంది. దాంతో జగన్ కి మైక్ ఇచ్చే సమయం ఎంత అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
కేవలం రెండు ప్రశ్నలుగా :
అసెంబ్లీలో సంఖ్యాబలం బట్టే అవకాశాలు ఇస్తామని ఇటీవలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంటే వైసీపీ తరఫున జీరో అవర్ లో రెండు ప్రశ్నలు వస్తాయి. ప్రతీ రోజు ఒక గంట పాటు జరిగే ప్రశ్నోత్తరాల సమయం లో వైసీపీకి రెండు ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంటుంది. సహజంగా ఆ రెండు ప్రశ్నలు సభ్యులకే వైసీపీ ఇస్తుంది. ఇక ఆ తరువాత వివిధ అంశాల మీద చర్చలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా సంఖ్యాబలం ఆధారంగానే మైక్ వైసీపీకి దక్కుతుంది అని అంటున్నారు. అంటే గరిష్టంగా రెండు నుంచి ఐదు నిముషాల సేపు ఇస్తారని ఒక అంచనా ఉంది. ఆ సమయాన్నే జగన్ వాడుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.
కౌంటర్ చేయడానికైనా :
విపక్ష నాయకుడి హోదా ఉంటే అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడినా లేక మంత్రులు మాట్లాడినా కూడా కౌంటర్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. అంతే కాదు తాము వివరణ అడగాలి అనుకున్నా సమయం ప్రత్యేకంగా ఇస్తారు. అయితే ఇపుడు అలాంటి అవకాశాలు జగన్ కి ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అధికార పార్టీ సహజంగానే గత ప్రభుత్వం తీరు మీద వారి విధానాల మీద విమర్శలు చేస్తుంది దానికి తమ వైపు నుంచి జవాబు చెప్పుకునే చాన్స్ వైసీపీకి ఎంత సేపు ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.
అయితే నిబంధనల సంగతి పక్కన పెడితే సభలో ఉన్న ఏకైక విపక్షగా వైసీపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. దానిని చక్కగా వాడుకోగలిగితే ఆయా చర్చలను బట్టి ఎక్కువ సమయమే పొందవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తం మీద సెప్టెంబర్ నెల మూడవ వారంలో ఏపీ వర్షాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈసారి జగన్ కనుక వస్తే మాత్రం కడు ఆసక్తికరంగా మారడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో
