Begin typing your search above and press return to search.

ఉదయం అసెంబ్లీ...మధ్యాహ్నం జగన్

వైసీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అలాగే ముప్పయి దాకా ఉన్న ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీని నిర్వహిస్తున్నారు.

By:  Satya P   |   16 Sept 2025 11:02 PM IST
ఉదయం అసెంబ్లీ...మధ్యాహ్నం జగన్
X

రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇవి వర్షాకాల సమావేశాలు ఈ సమావేశాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ ఒక వైపు కొనసాగుతూనే ఉంది. ఆ ఉత్కంఠ అలా ఉండగానే వైసీపీ అధినాయకత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీ శాసన సభా పక్షం సమావేశాన్ని నిర్వహించబోతోంది.

తాడేపల్లిలో మీట్ :

వైసీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అలాగే ముప్పయి దాకా ఉన్న ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీని నిర్వహిస్తున్నారు. ఈ భేటీ సారాంశం ఏమిటి అంటే రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం అని అంటున్నారు. రాజకీయ అంశాలతో పాటు ప్రజా సమస్యల ప్రస్తావన ఉంటునని అని అంటున్నారు.

ఉదయమే అసెంబ్లీ :

ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఉదయం ప్రారంభం అవుతుంది. పది గంటలకు సభ మొదలవుతుంది. ఆ తరువాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సామావేశం అవుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అన్న దానితో పాటు సభలో చర్చించే అంశాల మీద కూడా నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల తొలి రోజుల సభ ఎంతవరకూ జరుగుతుంది అన్నది పక్కన పెడితే 19 నుంచి పూర్తి రోజంతా సాగనుంది అని అంటున్నారు.

వైసీపీ వస్తుందా :

అయితే జగన్ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయడం వెనక వ్యూహం ఏమిటి అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమావేశంలో సభకు హాజరు కావడం మీద ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను తీసుకుంటారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అంతే కాదు ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నె నేపథ్యం ఉంది కూటమి ప్రభుత్వం అయితే దానిని తిరస్కరిస్తోంది. దాంతో హోదా లేకుండా సభకు హాజరైతే ఇన్నాళ్ళూ ఎందుకు వెళ్ళలేదు అన్న దానికి జవాబు జనాలకు చెప్పుకోవాలి. అలాగని ఇదే తీరున ఎన్నాళ్ళు సభకు దూరంగా ఉంటారు అన్నది కూడా ఉంది. దాంతో ఈ కీలక భేటీలో ఏ విషయం అన్నది చర్చించేందుకేనా అన్నది కూడా ఉంది.

అయ్యన్న విమర్శలు :

ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అని తాజాగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. ఒక ఉద్యోగి విధులకు హాజరు కాకుంటే జీతం ఇవ్వరని అలాంటిది సభకు రాకుండా జీతాలు తీసుకోవడమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం సభకు రావాల్సిందే అని అంటున్నారు. ఇలా కూటమి వైపు నుంచి తీవ్రంగానే విమర్శలు ఉన్నాయి. దాంతో జగన్ సమక్షంలో జరిగే వైసీపీ ఎల్పీ మీటింగ్ ఏ రకమైన డెసిషన్ ని తీసుకుంటుంది అన్నది అయితే చూడాల్సి ఉంది మరి.