ఏడు బిల్లులు, 4 చర్చలు: ఏపీ అసెంబ్లీ స్టార్ట్
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన సీటులో కూర్చుని సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు.
By: Garuda Media | 17 Aug 2026 8:18 PM ISTఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన సీటులో కూర్చుని సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. ఇక, ఈ సమా వేశాల్లో ఏడు ప్రధాన బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని మంత్రి సవిత ప్రకటించారు. అలానే.. నాలుగు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. సమయానుగుణంగా కూడా పలు అంశాలపై చర్చించనున్నట్టు ప్రకటించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు.
ఇవీ బిల్లులు
1) బీసీలకు రక్షణ చట్టానికి సంబంధించిన బిల్లు.
2) మహిళల భద్రతకు సంబంధించి దిశ సవరణ బిల్లు.
3) స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణ బిల్లు.
4) మేయర్, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికల చట్ట సవరణ బిల్లు.
5) కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసే కార్యాలయాలు, అధికారులకు సంబంధించిన బిల్లు.
6) మహిళలకు కల్పించే ప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లు.
7) నీటి హక్కులు- కొత్త ప్రాజెక్టుల సవరణ బిల్లు.
చర్చించే నాలుగు అంశాలు
1) బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు నియమించిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై చర్చించనున్నారు. మొత్తం 34 శాతం మేరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కమిటీ నివేదిక మాత్రం 27.26 శాతానికి పరిమితం కావాలని పేర్కొంది. ఇలా అయితేనే వివాదం లేకుండా రిజర్వేషన్‌లు అమలు చేయొచ్చని తెలిపింది. దీనిపై చర్చించనున్నారు.
2) మెగా డీఎస్సీ-2025: వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై సభలో చర్చించనున్నారు. మెగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదేసమయంలో మంత్రి నారా లోకేష్‌రాజీనామాకు కూడా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు డీఎస్సీ-2025లో ఏం జరిగిందన్న విషయంపై చర్చించనున్నారు.
3) గ్రూప్-1 : వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు భారీగా జరిగాయని ఇటీవల దర్యాప్తు సంస్థ నివేదికను కోర్టుకు సమర్పించింది. జవాబు పత్రాల మూల్యాంకనం.. ఏపీపీఎస్సీతో సంబంధం లేని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించారని.. అర్హతలు లేనివారు పత్రాలను దిద్దారని.. దీనివల్ల భారీ అవకతవకలు జరిగాయని చెప్పింది. దీనిపైనా సభలో చర్చించనున్నారు.
4) రెండున్నరేళ్ల పాలన: రెండున్నరేళ్ల కూటమి పాలనపై సభలో విస్తృతంగా చర్చించనున్నారు. గత వైసీపీ పాలనను కంపేర్ చేస్తూ.. రెండున్నరేళ్లలో తీసుకువచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, తెచ్చిన పెట్టుబడులను కూడా సభలో వివరించనున్నారు.
