Begin typing your search above and press return to search.

రికార్డుల నుంచి బాలయ్య వ్యాఖ్యల తొలగింపు.. స్పీకర్ నిర్ణయం ఎందుకు?

ఇదిలా ఉండగా.. ఈ వ్యాఖ్యలపై తాజాగా కామినేని శ్రీనివాస్ రియాక్టు అయ్యారు.

By:  Garuda Media   |   28 Sept 2025 9:42 AM IST
రికార్డుల నుంచి బాలయ్య వ్యాఖ్యల తొలగింపు.. స్పీకర్ నిర్ణయం ఎందుకు?
X

ఏదో చెప్పాలని మొదలు పెడితే.. మరేదో అయిన చందంగా ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఏపీలో శాంతిభద్రతల అంశంపై ఈ నెల 25న (గురువారం) అసెంబ్లీలో చర్చ జరగటం.. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న శాంతిభద్రతలు మొదలు.. కూటమి సర్కారులో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అన్న దానిపై చర్చ జరగటం తెలిసిందే.

ఈ చర్చలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేయటం.. అవి కాస్తా ఒకింత సంచలనమైతే.. దానికి కొనసాగింపుగా హిందూపురం ఎమ్మెల్యే కం ప్రముఖ సినీ నటుడు బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే. ఆ వ్యాఖ్యల ప్రకంపనలు నేటికి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వ్యాఖ్యలపై తాజాగా కామినేని శ్రీనివాస్ రియాక్టు అయ్యారు. గురువారం తాను చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ సభాపతి స్థానంలో కూర్చున్న ఉపసభాపతి రఘురామ క్రిష్ణను కోరారు.

తాను ప్రస్తావించిన అంశాల్లో కొన్ని అపార్తాలకు దారి తీశాయన్న అభిప్రాయం కలిగిందని.. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నట్లుగా కోరారు. దీనికి స్పందించిన రఘురామ.. కామినేని అభ్యర్థనను స్పీకర్ కు విన్నవించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తారని పేర్కొన్నారు.

కామినేని అభ్యర్థనతో పాటు ఆయన వ్యాఖ్యలు. వాటికి అనుబంధంగా బాలక్రిష్ణ సభలో చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. కామినేని వ్యాఖ్యల్ని తీసేసినప్పుడు.. దానికి స్పందనగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లో ఉండవని.. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించిన అంశాలన్నీ రికార్డుల నుంచి తీసేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. దీంతో.. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగుతుందా? ఇంకాస్త ముందుకు వెళుతుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.