Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్ కు ముహుర్తం పెట్టేశారు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ సిద్ధం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పద్దును సమావేశాల్లో ప్రవేశ పెడతారు.

By:  Garuda Media   |   29 Jan 2026 9:23 AM IST
ఏపీ బడ్జెట్ కు ముహుర్తం పెట్టేశారు
X

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ సిద్ధం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పద్దును సమావేశాల్లో ప్రవేశ పెడతారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ షెడ్యూల్ కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని అసెంబ్లీ వర్గాలకు అందాయి. షెడ్యూల్ లోకి వెళితే.. ఫిబ్రవరి 11 ఉదయం పది గంటలకు శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆనవాయితీగా గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావటం తెలిసిందే.

ఫిబ్రవరి పన్నెండున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టనున్నారు. అదే రోజు ఈ తీర్మానంపై సభ్యులు చర్చ జరుపుతారు. ఫిబ్రవరి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు.. భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేస్తారన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇక.. ఫిబ్రవరి 14న రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026 ఏప్రిల్ 1 - 2027 మార్చి31) సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ రాష్ట్రఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెడతారు.

రాష్ట్ర బడ్జెట్ ను పయ్యావుల కేశవ్ ప్రవేశ పెడితే.. అనంతరం రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాలు కనీసం నాలుగు వారాల పాటు సాగుతాయని చెబుతున్నారు కీలక బిల్లులతో పాటు, వివిధ అంశాల మీద చర్చ జరగనుంది. మరి.. ఈ సమావేశాలకు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

ఈసారి బడ్జెట్ లో అమరావతి రాజధాని నిర్మాణం.. పోలవరం ప్రాజెక్టు పనులు, నదుల అనుసంధానం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అదనంగా వాటర్ బడ్జెట్ పేరుతో సరికొత్తగా ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు. గత బడ్జెట్ వ్యయం రూ.3.22లక్షల కోట్లు కాగా.. ఈసారి బడ్జెట్ అంచనాలు రూ.3.5 నుంచి రూ.3.75 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు.