డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు ఇక ఇంటికేనా ?
అసెంబ్లీ అన్నది పవిత్ర ఆలయం అని అందరూ చెబుతారు. అలాగే దేశానికి పార్లమెంట్ అత్యున్నత వేదికగా ఉంది.
By: Satya P | 15 Sept 2025 9:33 AM ISTఅసెంబ్లీ అన్నది పవిత్ర ఆలయం అని అందరూ చెబుతారు. అలాగే దేశానికి పార్లమెంట్ అత్యున్నత వేదికగా ఉంది. చట్ట సభలలో అడుగుపెట్టాలీ అంటే లక్షలలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎంపీ కావాలంటే కనీసంగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ప్రజల నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే అంటే రెండు లక్షల మంది ఓటర్లు ఆదరించి ఆశీర్వదించాలి. ఈ లెక్కన చూసుకుంటే కోట్లలో జనాభా ఉంటే వందలలో ఉన్న చట్ట సభలకు ఎంపిక కావడం ఎంతటి అదృష్టమో అని చెప్పాల్సిందే.
గెలిచిన తరువాతనే :
చట్ట సభకు వెళ్ళి ప్రజా సమస్యలు మీద మాట్లాడుతాను పోట్లాడుతాను అని చాలా పెద్ద హామీలు ఇచ్చిన వారు తీరా సభకు ఎంత మంది వెళ్తున్నారు, వెళ్ళినా ఎంత సేపు ఉంటున్నారు, ఇక ప్రజా సమస్యలు ఎన్ని సార్లు ప్రస్తావిస్తున్నారు అన్నది ఒక చర్చ. అది అలా ఉంచితే అసలు సభకే వెళ్ళమని చెబుతున్న వారి విషయం ఏమిటి అన్నది కూడా మరో కీలకమైన అంశం. ప్రజలు ఓట్లు వేసి చట్ట సభకు వెళ్ళమని గెలిపిస్తే సభకు వెళ్ళకుండా సొంత అజెండాతో ముందుకు సాగే వారికి అలాగే అవతల ఇవతల రాజకీయ సమరం వ్యూహాల కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకునే వారికి చర్యలు ఏ మేరకు ఉంటాయన్నది కూడా మరో అంశంగా ఉంది.
వరుసగా జరిగితే వేటు :
స్పీకర్ కి చెప్పకుండా అసెంబ్లీ వర్కింగ్ డేస్ అరవై రోజులలో ఒక్కసారీ సభ ముఖం చూడకుండా గైర్ హాజరు అయితే ఆటోమెటిక్ గా సభ్యత్వం రద్దు అవుతుంది అన్నది నిబంధనలలో ఉందని కూటమి వైపు నుంచి చెబుతున్న మాట. ఈ మధ్యనే డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు దీని మీద మాట్లాడుతూ ఈసారి సభకు రాకపోతే జగన్ పులివెందులకే ఉప ఎన్నిక వస్తుందని కూడా హెచ్చరించారు. మరి అదే విధంగా వైసీపీ నుంచి నెగ్గిన మరో పది మంది ఎమ్మెల్యేల విషయం ఉంటుందని చెప్పకనే చెప్పారు.
సవాళ్ళూ శపధాలు :
తాజాగా చూస్తే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయం మీద లోక్ సభ స్పీకర్ ఒక మార్గ నిర్దేశం చేయాలని కోరారు. అలా కనుక చేస్తే తాము దానిని అనుసరిస్తామని చెప్పారు. విశేషం ఏమిటి అంటే పార్లమెంట్ లో ఎంపీలు అలా ఎవరూ చేయడం లేదు. ఒక పార్టీ నుంచి ఒకే సభ్యుడు ఉన్నా సభకు వస్తున్నారు. వారికి స్పీకర్ మాట్లాడే చాన్స్ ఇస్తున్నారు. అసెంబ్లీలోనే ఈ గైర్ హాజర్లు, సవాళ్ళూ శపధాలు అన్నీ వస్తున్నాయని అంటున్నారు. తమిళనాడులో జయలలిత మొదట అసెంబ్లీకి రాను అని చెబుతూ సీఎం గానే అడుగు పెడతాను అని ఒక శపధం చేశారు. ఇది తొంబై నాటి ముచ్చట. ఆ తరువాత ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కూడా ఇదే తీరున శపధం చేశారు. సభకు రాలేదు. 2017లో జగన్ శపధం చేస్తే 2022లో చంద్రబాబు అదే విధంగా చేశారు. అయితే వీరిలో జగన్ అండ్ ఆయన ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారి పార్టీల ఎమ్మెల్యేలు సభకు హాజరవుతూ వచ్చారు. దాంతో అది అంత సీరియస్ ఇష్యూగా మారలేదు. పైగా అప్పట్లో కొంతకాలం సభకు వచ్చి చివరి రెండేళ్ళలో మాత్రమే ఈ విధంగా చేశారు.
లోక్ సభ నిర్ణయిస్తుందా :
కానీ ఏపీలో 2024 తరువాత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి పదిహేను మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పలు మార్లు అసెంబ్లీ జరిగింది. వైసీపీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. ఇలా ఎన్నిక అయిన వెంటనే సభకు రాకుండా దూరంగా ఉండడం సరికొత్త సమస్యగా మారింది. దాంతోనే ఇపుడు ఇది హాట్ టాపిక్ గా కూడా ఉంది. మరి దీని మీద లోక్ సభ స్పీకర్ ఏ విధమైన డైరెక్షన్ ఇస్తారో చూడాల్సి ఉంది. లోక్ సభ కనుక ఒకసారి డైరెక్షన్ ఇస్తే అన్ని రాష్ట్రాలూ ఇదే సంప్రదాయంగా అమలు చేస్తాయి. అపుడు నాయకుల శపధాలు కూడా స్టాప్ అయిపోవచ్చు అని అంటున్నారు. లేకపోతే సభ్యత్వం పోతుంది అన్నది కూడా ఉంటుంది కాబట్టి అని అంటున్నారు.
