Begin typing your search above and press return to search.

మంత్రి అచ్చెన్నాయుడు పవర్ ఫుల్ స్పీచ్.. రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్

అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

By:  Tupaki Political Desk   |   28 March 2026 6:24 PM IST
మంత్రి అచ్చెన్నాయుడు పవర్ ఫుల్ స్పీచ్.. రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
X

అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ టీ, కాఫీ బ్రేకులు లేకుండా, భోజన విరామం కూడా ఇవ్వకుండా నిరాంటకంగా కొనసాగుతోంది. సభలో తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు గత ప్రభుత్వంలో అమరావతిపై అనుసరించిన విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేశంగా మాట్లాడారు. మంత్రి ప్రసంగంలో రెండు అన్ పార్లమెంట్ పదాలను వాడారని, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

అమరావతిపై తీర్మానాన్ని సమర్ధిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు బలమైన వాదన వినిపించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి నిప్పులు చెరిగారు. అప్పట్లో తాము ప్రతిపక్ష స్థానంలో ఉన్నామని, అప్పుడు అధికార పక్షంలో ఉన్న వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అనరాని మాటలు ఆడారని, వారి తిట్లు విని ఎందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నామని బాధపడ్డామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

కోడి పిల్లలను మార్చినట్లు మొదటి నుంచి ఏపీ రాజధానులు మారుతూ వచ్చాయని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 1953లో కర్నూలు, 1956లో హైదరాబాద్ రాజధానులుగా చేశారని, 2014లో మనకు ఇష్టం లేకపోయినా ఏపీని మళ్లీ విడగొట్టారని అచ్చెన్నాయుడు గతాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో 2019లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వినియోగించుకోడానికి అవకాశం ఉన్నప్పటికీ మన నేలపై నుంచే పాలన సాగాలని రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని అన్నారు.

ఇక 2019లో ఎన్నికలు వచ్చాయని, ఆ సమయంలో ప్రజలు చాలా తప్పు చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి సంబంధం లేదని చెబుతూ ప్రజలు 2019లో వైసీపీని గెలిపించి తప్పు చేశారని మంత్రి అన్నారు. 2019లో రెండోసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనకు ఈ బాధలు ఉండవని, ఇప్పటికే అమరావతి పూర్తయ్యేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటుములు సహజమని, కానీ వైసీపీ గెలవడమే తనలాంటి వారిని తీవ్రంగా బాధించిందని అచ్చెన్నాయుడు అన్నారు.

2014-19లో రాష్ట్రం స్వర్ణయుగంలో నడిచిందని, కానీ ప్రజలు ఎందుకు ఓడించారా? అని బాధపడినట్లు తెలిపారు. కానీ, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, లక్ష కోట్లు దోచుకుని 16 నెలలు జైలులో ఉన్నవారికి ఓటేశారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సమయంలో అచ్చెన్న సహనం కోల్పోయే దుర్మార్గులు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఇదే క్రమంలో ఆవేశంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు గత ప్రభుత్వంలో వైసీపీ నేతల తిట్లు భరించలేకపోయామని వాపోయారు. దుర్మార్గులు రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు. ఒకసారి తాము ప్రతిపక్షంలో ఉండగా రాజధాని అమరావతిపై స్వల్ప కాలిక చర్చ నిర్వహించారని, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించారని, ఒక్కరు కూడా మంచి మాట్లాడలేదని అన్నారు.

ఏ ఒక్కరూ అమరావతిని ముందుకు తీసుకువెళదామని చెప్పలేదని, తమను తిట్టడం, అవినీతి ఆరోపణలు చేయడం తప్ప అమరావతి కోసం ఎవరూ మాట్లాడలేదని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ సందర్భంలో తమను సస్పెండ్ చేసి బయటకు పంపారని, ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక ఆ తర్వాత తమను అసెంబ్లీలో ఎన్నో రకాలుగా అవమానించారని, తాము సభకు వెళ్లమని చెప్పినా చంద్రబాబు ఒప్పుకోలేదన్నారు.

ఇదే సమయంలో శాసనమండలిలో లైట్లు ఆపేసి రాజధానిపై చర్చ నిర్వహించారని, ఆ పెద్దల సభలో చూస్తే అనరాని మాటలు అన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ మాటలు వింటే గన్ పట్టుకుని కాల్చేయాలని అనిపించిందని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నంత సేపు ఎమ్మెల్యేలు చప్పట్లతో హోరెత్తించారు. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రసంగం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆవేశంలో ఒకటి రెండు అశబ్దాలు మాట్లాడారని వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.