Begin typing your search above and press return to search.

ఏపీలో ఫ‌స్ట్‌: 'అరణ్యారామం'.. భూమి పూజ చేసిన పవన్ కల్యాణ్.

ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న శాఖకు సంబంధించిన కీల‌క కేంద్ర కార్యాలయాన్ని నిర్మించే ప‌నుల‌కు భూమి పూజ చేశారు.

By:  Garuda Media   |   19 Jun 2026 3:12 PM IST
ఏపీలో ఫ‌స్ట్‌: అరణ్యారామం.. భూమి పూజ చేసిన పవన్ కల్యాణ్.
X

ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న శాఖకు సంబంధించిన కీల‌క కేంద్ర కార్యాలయాన్ని నిర్మించే ప‌నుల‌కు భూమి పూజ చేశారు. అట‌వీ శాఖ‌కు సంబంధించిన దాదాపు అన్ని ప్ర‌ధాన విభాగాల‌తో పాటు... రికార్డుల‌ను భ‌ద్ర ప‌రిచేందుకు ఉపయోగ‌ప‌డేలా.. అర‌ణ్యారామం పేరుతో భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. దీనికి తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్ శంకు స్థాప‌న చేశారు.

మంగ‌ళ‌గిరిలోని బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు రూ.27 కోట్ల వ్యయంతో 'అరణ్యారామం' నిర్మాణం చేపట్ట‌నున్నారు. అనంత‌రం.. మంగ‌ళ‌గిరిలోని ఎయిమ్స్‌కు వెళ్లే మార్గంలో పవన్ కల్యాణ్ మొ క్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. అట‌వీ సంప‌ద‌ను ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిర‌క్షించాల‌ని సూచించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. రాష్ట్రంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కోసం.. ప్ర‌భుత్వం చేసే కృషికి అంద‌రూ క‌ల‌సి రావాల‌ని పిలుపునిచ్చారు.

కాగా.. అర‌ణ్యారామం పేరుతో నిర్మించ‌నున్న ఐదు అంత‌స్థుల భ‌వ‌నాన్ని రెండు ఎక‌రాల్లో చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించి కేంద్ర అట‌వీ శాఖనుంచి కూడా అనుమ‌తులు తెచ్చుకున్నారు. ఈ భ‌వ‌నంలో మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ తో పాటు భారీ లైబ్ర‌రీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో వివిధ వ‌న్య‌ప్రాణుల ఫొటోల‌తో కూడిన ఎగ్జిబిష‌న్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంలో ఫ‌స్ట్‌..

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అట‌వీ శాఖ‌కు ప్ర‌త్యేకంగా కార్యాల‌యం లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లో అట‌వీశాక ప‌ర్య‌వేక్షణ కార్యాల‌యం ఉంది. 12 ఏళ్ల త‌ర్వాత‌.. ఏపీలో నూత‌నంగా ఈ భ‌వనాన్ని పూర్తిగా అట‌వీ శాఖ‌కే ప‌రిమితం చేస్తూ.. నిర్మిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ భ‌వ‌నంలోనే మంత్రి కార్యాల‌యం కూడా ఉంటుంది. అలానే అట‌వీ శాఖ ఉన్న‌తాధికారుల‌కు కూడా ప్ర‌త్యేక కార్యాల‌యాల‌ను నిర్మించ‌నున్నారు. దీనిని వ‌చ్చే ఏడాది లోగా పూర్తి చేయ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు.