Begin typing your search above and press return to search.

భార్యా భర్తలకు ఒకే చోట ఉద్యోగాలు

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో దాదాపుగా లక్షా పాతిక వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

By:  Satya P   |   18 Nov 2025 9:40 AM IST
భార్యా భర్తలకు ఒకే చోట ఉద్యోగాలు
X

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో దాదాపుగా లక్షా పాతిక వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా 2019 నుంచి విధులలో ఉన్నారు. వీరి సేవలు దాదాపుగా ఆరేళ్ళుగా అందిస్తున్నా ఉద్యోగం విషయంలో కానీ రూల్స్ ఫ్రేమింగులో కానీ ఏమీ ఎదుగు బొదుగూ లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమకు పే స్కేల్ ప్రకటించలని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బదిలీలు పదోన్నతులు కల్పించాలని తమకు టైం స్కేల్ ని ఫిక్స్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేయాలని చాలా కాలంగా డిమాండ్లు పెడుతున్నారు. అయితే వాటి మీద గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. ఏణ్ణర్ధంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో సైతం తమ కోరికలు తీరడం లేదని వాపోతున్నారు.

ఎట్టకేలకు తీపి కబురు :

ఈ పరిణామాల నేపధ్యంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిమాండ్ విషయంలో నిర్ణయం తీసుకుంది. దాంతో సచివాలయ ఉద్యోగులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సచివాలయ ఉద్యోగులు భార్యా భర్తలు వేరు వేరు జిల్లాలలో పనిచేస్తూ నలిగిపోతున్నారు. దాంతో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యా భర్తలను ఒకే చోట ఉద్యోగాలలో ఉంచాలని వారు కోరుతున్నారు. ఇపుడు అ మేరకు ప్రభుత్వం వారికి అనుమతించింది. తాజాగా ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

అంతర్‌జిల్లా బదిలీలకు ఓకే :

ఈ జీవో ప్రకారం అంతర జిల్లాలలో బదిలీలకు సర్కార్ సమ్మతించింది. అంటే ఒకే జిల్లాలో వారు ఉండొచ్చు అన్న మాట. ఈ ప్రక్రియ అంతా సాఫీగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్ లైన్ లోనే జరిగేలా చూడాలని కోరింది భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేయడానికి సంబంధించి చేసుకునే దరఖాస్తులౌ ఆన్ లైన్లోనే పూర్తి చేయాలని ఈ నెలాఖరు వరకూ వారికి అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొంది. అప్పటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా వెల్లడించింది.

పెద్ద సంఖ్యలోనే :

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలోనే ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో భార్యాభర్తలు ఒకే చోట పనిచేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయని పనిలో నాణ్యత పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు అయితే తమకు కుటుంబపరమైన ఒత్తిడి తగ్గిపోతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే కేవలం భార్యాభర్తలకే కాకుండా మిగిలిన ఉద్యోగుల విషయంలో ఈ బదిలీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే తమ మిగిలిన డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోరుతున్నారు.