అమరావతి రైతులే ప్రత్యేక అతిథులుగా !
ఇక అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగళాల ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 22 ఎకరాలలో ఉన్న ఈ పెరేడ్ గ్రౌండ్ లో గణ తంత్ర వేడుకలు జరుగుతాయి.
By: Satya P | 24 Jan 2026 4:00 AM ISTఏపీ మొత్తం కోసం వారు త్యాగాలు చేశారు. తమ భూములను తరాలుగా అనుభవిస్తున్న సంపదను నమ్ముకున్న వాటిని రాజధాని కోసం ఇచ్చేశారు వారే అమరావతి రైతులు. అమరావతి రైతులు ఇచ్చిన వేలాది ఏకరాల భూములలోనే రాజధానికి పునాది పడింది. అయితే మధ్యలో ప్రభుత్వం మారడంతో అయిదేళ్ళ పాటు ఆటంకాలు ఉన్నా కూడా ఇపుడు మాత్రం అమరావతి రాజధానికి కళ కనిపిస్తోంది. నిర్మాణాలలో వేగం పుంజుకుంది. ఒక నిర్దిష్ట కాల పరిమితితో అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో విభజన ఏపీలో తొలిసారిగా అమరావతి రాజధాని గడ్డ మీద గణ తంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు ఇది ఒక విధంగా అమరావతికి గర్వ కారణం అని అంటున్నారు.
జిల్లాల నుంచి :
విభజన ఏపీలో ప్రతీ ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు అలాగే గణతంత్ర వేడుకలను విజయవాడలో నిర్వహిస్తూ వచ్చేవారు. కానీ తొలిసారి అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు అమరావతి సిద్ధం అవుతోంది. అంతే కాదు మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో ఈ ప్రాంతంలో ఉత్సాహపూరితమైన వాతావరణం కనిపిస్తోంది.
వేదిక అక్కడే :
ఇక అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగళాల ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 22 ఎకరాలలో ఉన్న ఈ పెరేడ్ గ్రౌండ్ లో గణ తంత్ర వేడుకలు జరుగుతాయి. వీవీఐపీలకు వీఐపీలకు ఇతర ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైన అతిధుల కోసం మరో స్పెషల్ గ్యాలరీని సిద్ధం చేస్తున్నారు.
వారి కోసమే అక్కడ :
ఈ రిపబ్లిక్ డే వేడుకల కోసం హాజరు అయ్యేలా అమరావతి రైతులకు ఆహ్వానాలు అందాయి. అక్కడ వారి కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం విశేషం. ఇక వేడుకలకు హాజరుకావలసిందిగా రైతులకు సాదరంగా ఆహ్వాన పత్రికలు అధికారులు పంపిస్తున్న తీరు చూస్తే వారి పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటి అన్నది అర్ధం అవుతోంది. దాంతో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి రైతులు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు అని అంటున్నారు.
ఇదే శుభారంభంగా :
ఇక అమరావతిలో జరిగే గణతంత్ర వేడుకలను స్వయంగా తిలకించేందుకు మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లను సీఆర్డీఏ అధికారులు చేస్తున్నారు. అదే విధంగా ఈ వేడుకలకు హాజరయ్యే వీఐపీలు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మీద ఈసారి ఏపీలో అందునా అమరావతిలో జరిగే గణతంత్ర వేడుకలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయన్నది వాస్తవం.
