Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం కొంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే...

ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి ఎంత సరకు కొనుగోలు చేస్తున్నాయన్న వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   8 Nov 2025 3:51 PM IST
ఏపీలో మద్యం కొంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే...
X

ఏపీలో మద్యం విక్రయాలపై ప్రభుత్వం నిఘా పెంచింది. ములకలచెరువలో కల్తీ మద్యం వెలుగుచూసిన నుంచి అమ్మకాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఎక్కడికక్కడ ట్రాక్ చేసే విధానం ప్రవేశపెట్టింది. వైన్ షాపులు, బార్లతో సహా మద్యం డిపోల నుంచి వినియోగారులకు చేరేవరకు పక్కాగా లెక్కలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. పరతి దశలోనూ ట్రాకింగ్ విధానం అమలు చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి ఎంత సరకు కొనుగోలు చేస్తున్నాయన్న వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. షాపుల నుంచి ఏ మేరకు విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎంత? అన్న వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదు. దీనివల్ల కల్తీ జరగడంతోపాటు అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ప్రతి రోజు మద్యం అమ్మకాలతోపాటు షాపుల్లో ఏ బ్రాండ్ సరకు ఎంత మేర స్టాకు ఉందన్న సమాచారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు చిక్కుతుందని అంటున్నారు.

మద్యం విక్రయాలు, ఇతరత్రా సమాచారాన్ని రియల్ టైములో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో వశిష్ట అనే సంస్థ ఎక్సైజ్ శాఖకు ఆన్లైన్ సేవలు అందజేసేది. ఈ సంస్థ కాంట్రాక్టు గడువు ముగియడంతో ట్రాక్ అండ్ ట్రేస్ సేవలు అందజేసే సంస్థలను ఆహ్వానించింది. దీనిలో భాగంగా ఇకపై వినియోగదారుడి వరకు అమ్మకాలను ట్రాకింగ్ ేసే విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వినియోగదారుడి సమాచారం కచ్చితంగా తీసుకోవాలా? వద్దా? అనే విషయమై తర్జనభర్జన సాగుతోంది.

మద్యం కొనుగోలుదారులు తమ వివరాలను ఇచ్చేందుకు అంగీకరిస్తారా? అనే సంశయం వేధిస్తోంది. దీంతో కనీసం ఫోన్ నంబరు అయినా తీసుకునే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇటీవల ప్రవేశపెట్టిన ఎక్సైజ్ సురక్ష యాప్ లో సీసాలను స్కాన్ చేసేవారి వివరాలు తెలిసేలా యాప్ రూపొందించారు. నకిలీ మద్యం అని ఎవరైనా ప్రచారం చేస్తే అది నిజమా? కాదా? అనేది ఎక్సైజ్ శాఖకు వెంటనే తెలిసిపోతుంది. నిజంగానే సీసాలు స్కాన్ కాలేదా? అనే వివరాలు అధికారులకు తెలియనున్నాయి.