మళ్లీ స్తబ్దత.. ఎమ్మెల్యేలు బిజీ బిజీ ..!
ఏపీలో మరోసారి స్తబ్దత నెలకొంది. గత నెలలో ఒకింత ఫర్వాలేదని అనుకున్నా.. ఈ నెలకు వచ్చేసరికి.. మళ్లీ నాయకులు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
By: Garuda Media | 6 Jan 2026 7:00 PM ISTఏపీలో మరోసారి స్తబ్దత నెలకొంది. గత నెలలో ఒకింత ఫర్వాలేదని అనుకున్నా.. ఈ నెలకు వచ్చేసరికి.. మళ్లీ నాయకులు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. గత ఏడాది పనులు చేసిన నాయకులు.. తమ బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు గత ఏడాది బిల్లులు క్లియర్ కాలేదన్నది వారి ఆవేదన. మరో మాసంలో 2026-27 వార్షిక బడ్జట్‌ను ప్రవేశ పెట్టేందుకు.. ప్రభుత్వం రెడీ అవుతోంది.
దీంతో తమ బిల్లుల సంగతి తేల్చాలంటూ.. ఆర్థిక శాఖ వర్గాలపై ఒత్తిడి ప్రారంభించారు. ముఖ్యంగా పంచాయతీల్లో చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. 10 శాతం నుంచి 30 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. కేంద్ర నిధులు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఆ బిల్లులు కూడా వసూలు కావడం లేదు. దీంతో నాయకులు కార్యాలయాల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
మరోవైపు.. ప్రజల మధ్య ఉండాలని.. పేర్కొంటూ ఈ నెల 15 వరకు సమయం ఇచ్చారు సీఎం చంద్రబాబు. దీనిని కొందరు పట్టించుకున్నా.. మరికొందరు మొక్కుబడి తంతుగా మార్చేస్తున్నారు. ఇది మరింత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం జల వివాదాలు తారస్థాయిలో రచ్చ రేపుతున్నాయి. దీనిపైనా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. అధినేత నుంచి ఆదేశాలు రాలేదని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఇది సబ్జెక్టు పరంగా ముడిపడిన వ్యవహారమని.. తాము మాట్లాడలేమని అంటున్నారు.
ఇలా.. ఎవరికి వారు తమ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయా? అనే ఆరా తీసే పనిలోనే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. వాస్తవానికి గత నెల 31న కొంత వరకు జోష్ కనిపించింది. పింఛన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే చేపట్టడంతో నాయకులు కదిలారు. పింఛన్లు పంపిణీ చేసారు. కానీ.. ఆ తర్వాత ప్రజల మధ్య ఉన్నవారు ఎవరూ కనిపించలేదు. దీంతో మరోసారి రాష్ట్రంలో పాలన పరంగా స్తబ్దత నెలకొంది. దీనిని కట్టడి చేసేందుకు చంద్రబాబు మరోసారి క్లాస్ తీసుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
