సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జలగలు.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతిపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో బుధవారం ఏకకాలంలో దాడులకు దిగింది.
By: Tupaki Political Desk | 6 Nov 2025 11:07 AM ISTఏపీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జూలు విధిల్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతిపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో బుధవారం ఏకకాలంలో దాడులకు దిగింది. రాష్ట్రంలోని కీలకమైన 12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పలు అవినీతి ఉదంతాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారుల రాకతో ఆయా కార్యాలయాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులు పరుగులు తీశారు. కొందరు తమ వద్ద ఉన్న డబ్బును కిటికీల్లోంచి బయటకు పారేయగా, మరికొందరు బాత్రూంలలో పారబోశారు. ఇలా దాదాపు రూ.75 వేల లెక్కచూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కూడా ఈ దాడులు, తనిఖీలు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు, డాక్యుమెంట్లలో తేడాలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఈ దాడులు కొనసాగాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నంలోని పెదగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్ ఆఫీసుల్లో దాడులు జరిగాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేట, తిరుపతి జిల్లా రేణిగుంట, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, అన్నమయ్య జిల్లా రాజంపేట, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల్లో తనిఖీలు జరిగాయి.
భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసారావుపేట కార్యాలయాల్లో పది వేల రూపాయల నుంచి 75 వేల వరకు అనధికారిక నగదు లభించిందని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ తెలిపారు. అనధికారిక లావాదేవీలు, లంచాల రూపంలో ఈ సొమ్ము సేకరించినట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు, మరింత లోతుగా కూపీ లాగుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేస్తున్న ఏనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం వల్ల ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. కొన్నిచోట్ల నిషేధిత భూములను కలెక్టర్ అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్ చేయడం, లంచాలు ఇవ్వని కొందరి ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు యజమానులకు ఇవ్వకుండా పెండింగులో పెట్టడం డాక్యుమెంట్లు సమగ్రంగా లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన ఏసీబీ అధికారులు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాల రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఏసీబీ తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ మొదటి అంతస్తులోని జాయింట్-1, జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో కొంతమంది నగదును కిందకి విసిరేశారు. ఆ మొత్తం రూ.30 వేలు దాకా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. జనరల్ వాష్ రూములో మరో రూ.18 వేలు కనుగొన్నారు. ఇలా మొత్తం రూ.48 వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి కార్యాలయంలో పూర్తయిన 36 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల వివరాలు వాటికి సంబంధించిన లావాదేవీలు, నగదును కిందకి విసిరింది ఎవరు? వాష్ రూంలో ఉన్న నగదు ఎవరిది? ఎందుకు దాచారు? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లడంతోనే అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ ల్యాప్ టాప్స్, ప్రింటర్లు వదిలేసి పరుగు తీశారు. ఒక్క ఉద్యోగి వద్ద మిగిలిన అందరి వద్ద లెక్క చూపని నగదు భారీగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జగదాంబ సెంటర్ ఎస్ఆర్వో వద్ద రూ. 10 వేలు నగదు లభించినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ బీరువాలో రూ.74,500 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యాలయంలో వసూళ్ల కోసం ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తులను నియమించారు. నరసారావుపేటలో రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దాదాపు ప్రతి కార్యాలయంలోనూ అక్రమాలను ఏసీబీ గుర్తించింది. గురువారం కూడా ఈ తనిఖీలు కొనసాగనున్నట్లు చెబుతున్నారు.
