కూటమికి చిక్కు: 2500 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి ..!
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చింది. ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నామని.. పేదల పక్షపాతిగా ప్రభుత్వం ఉందని చెప్పుకొస్తున్నారు.
By: Garuda Media | 17 Sept 2025 3:50 PM ISTఏపీలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చింది. ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నామని.. పేదల పక్షపాతిగా ప్రభుత్వం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇది నిజమే. ఈ విషయంలో సందేహం లేదు. నెల నెలా 1నే పింఛన్లు ఇస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో సొమ్ములు వేశారు. అయితే.. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. సడెన్‌గా వచ్చిన పెద్ద సమస్య సర్కారును ఇరకాటంలోకి నెట్టేసింది.
అదే.. ఆరోగ్య శ్రీ. పేదలకు, అదేవిధంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా వరంగా ఉన్న ఆరోగ్య శ్రీ.. ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారింది. దాదాపు ఏడాది కాలంగా కార్పొరేట్ వైద్య శాలలకు ఆరోగ్య శ్రీ కింద.. నిధులు విడుదల చేయలేదు. దీంతో ఇప్పటికే పలుమార్లు.. చర్చలు జరిపినా.. పలు సందర్భాల్లో వాయిదా వేసినా.. వైద్య శాలల యజమానులు మాత్రం .. ఇప్పుడు ససేమిరా అంటున్నారు. తమ సొమ్ము తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమకు ఖర్చులు పెరిగిపోయాయని.. సర్కారు నుంచి ఎలాంటి ఆదరువు కనిపించడం లేదని అంటున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు రకాల చికిత్సల కోసం.. ఆయా కార్పొరేట్ వైద్య శాలల్లో చేరిన పేదలు.. బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. వైద్య శాలలు చెబుతున్న లెక్క ప్రకారం దాదాపు 2500 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వం .. ఆయా ఆసుపత్రులకు బకాయి ఉంది. ఈ సొమ్మును చెల్లిస్తే తప్ప.. తిరిగి వైద్యం ప్రారంభించేది లేదని ఆయా ఆసుపత్రులు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత పెద్ద మొత్తంలో నిధులు సమీకరించే ప్రయత్నం చేసే అవకాశం లేదు.
మరోవైపు.. ఇతర ప్రాజెక్టులు సహా.. పెరుగుతున్న ఆర్టీసీ ఖర్చు(ఉచిత మహిళా ప్రయాణానికి నెలకు 350 కోట్ల వరకు వెచ్చించాలని సర్కారు భావించినా.. ఇప్పుడు అది మరో 100 కోట్లకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు). ఇతర సంక్షేమ పథకాలు కూడా సర్కారుకు ఇరకాటంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ బకాయిలపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో వైద్యశాలలు.. తమ సేవలను నిలుపుదల చేశాయి. తమకు సొమ్ము ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. కానీ, అంత సొమ్ము సర్కారు ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి. సెన్సిటివ్ వ్యవహారం.. పైగా పేదలకు సంబంధించిన విషయం కావడంతో కూటమికి ఇబ్బందిగానే మారిందని చెప్పాలి.
