"52 శాతం మందికి 34 శాతం ఇచ్చాం.. న్యాయం చేయండి"
కేవలం 50 శాతానికి మాత్రమేపరిమితం చేయడం అనే నిబంధనను రాజ్యాంగ కర్తలు ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.
By: Garuda Media | 4 Oct 2026 9:19 AM ISTఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ``52 శాతం మందికి 34 శాతం ఇచ్చాం.. న్యాయం చేయండి`` అని కోర్టును అభ్యర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 105 సహా పలు జీవోలను తీసుకువచ్చింది. దీని ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో 33.9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 32 శాతం సీట్లను బీసీలకు రిజర్వ్ చేస్తారు. అయితే.. దీనిపై తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు శుక్రవారం ఆ జీవోలను కోట్టి వేసింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని పేర్కొంటూ బీసీల రిజర్వేషన్ల జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిందని, ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిందని పేర్కొంది. అయితే.. గతంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 64 శాతం రిజర్వేషన్‌ను ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని.. తాము 52 శాతం మంది బీసీలు ఉంటే.. కేవలం వారికి 34 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించామని తెలిపింది.
ప్రాంతీయ, సామాజిక అసమానతలను రూపు మాపి.. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అభ్యున్నతి పథంలో వారిని నడిపించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది. అంతేకాదు.. బీసీ రిజర్వేషన్లను అన్ని చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించామని తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏపీని ప్రత్యేకంగా పరిగణించాలని కోరింది. ఇప్పటికే విభజన కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి రిజర్వేషన్ ఫలాలను అందించడం తప్పుకాదని పేర్కొంది.
రాజ్యంగంలో లేదు..
రాజ్యాంగంలో రిజర్వేషన్ పరిమితులు విధించలేదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. కేవలం 50 శాతానికి మాత్రమేపరిమితం చేయడం అనే నిబంధనను రాజ్యాంగ కర్తలు ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. దీని అర్థం.. అణగారిని వర్గాలు ఎంత మంది ఉన్నా.. అందరికీ న్యాయం చేసేందుకు రిజర్వేషన్లను వినియోగించు కోవచ్చన్న రాజ్యాంగ కర్తల మూల సూత్రాన్ని, వారి ఆలోచనలను ప్రభుత్వం పాటిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే 34 శాతంబీసీలకు రిజర్వేషన్ కల్పించామని పేర్కొంది. ఇతర సామాజిక వర్గాలకు ఎలాంటిఅన్యాయం జరగబోదని వెల్లడించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశంఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
