కొత్త ఏడాదికి అదిరి పోయే కానుక
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో ప్రజలకు ఒక మంచి కానుకను ప్రకటించింది.
By: Satya P | 1 Jan 2026 10:39 PM ISTఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో ప్రజలకు ఒక మంచి కానుకను ప్రకటించింది. దీర్ఘకాలంగా భూ వివాదాలతో దానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22ఎ జాబితా నుండి ఐదు రకాల భూముల తొలగిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతే కాదు మరో నాలుగు రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో రెండు నెలలలో ప్రీ హోల్డ్ భూములపైనా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో కొత్త ఏడాది 2026 22ఎ జాబితా భూములను కలిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వరంగా మారింది.
భూ నామ సంవత్సరంగా :
ఇక 2026 ని భూ నామ సంవత్సరంగా కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసింది. రైతులకు, భూ యజమానులకు ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ నిర్ణయం కారణంగా మాజీ ప్రస్తుత సైనికోద్యోగులకు స్వాతంత్ర్య సమర యోధులకు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు కలిగి ఉన్న వారికి మేలు చేకూరుతుంది. 1955 జూన్ నెల 18వ తేదీ నాటికి ముందు అసైన్ చేసిన భూములుగా ప్రయివేట్ పట్టా భూములుగా ఉన్న వాటిని 22ఎ జాబితా నుండి తొలగించినట్లుగా రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు.
వీటి విషయంలో సీరియస్ గా :
అదే విధంగా కేవలం కొంత భూమి కోసం ఆయా సర్వే నెంబర్ లో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచితే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం గుర్తించింది. ఆ కొంత భూమిని సబ్ డివిజన్ చేసి దాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో ఇక మీదట ఉంచనున్నారు. అలా కాకుండా ఉన్న మిగిలిన భూమినంతా కూడా నిషేధిత జాబితా నుండి తొలగించినట్లుగా మంత్రి తెలిపారు. అయితే షరతులు గల పట్టా భూములు, సర్వీసు ఇనామ్ భూములు, గతంలో నిషేధిత జాబితా నుండి తొలగించినప్పటికీ రీ సర్వే సమయంలో మరలా 22 ఎలో చేర్చిన చుక్కల భూములు, గతంలో 22ఎ జాబితా నుండి తొలగించని చుక్కల భూములపై త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెబుతున్నారు.
వీటికి పూర్తిగా వర్తింపు :
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ లేదా 10 (1) రిజిస్టర్, అడంగల్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు లేదా అసైన్మెంట్ రిజిస్టర్లు లేదా డీఆర్ దస్త్రాలు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు 8 ఎ రిజిస్టర్ లేదా డికెటి పట్టాలలో ఏదైనా ఒకటి ఉన్నా ఆయా భూములను తప్పనిసరిగా 22 ఎ జాబితా నుండి తొలగించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక మీదట ఈ భూములకు సంబంధించి తమకు ఇంకా అనేక డాక్యుమెంట్లు కావాలని భూయజమానులను తిప్పుకోవద్దని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించారు. ఇలా ఐదు రకాల భూములకు సంబంధించి దాదాపు ఎనిమిది రకాల పత్రాల్లో ఏ ఒక్క పత్రమున్నా 22 ఎ జాబితా నుండి తొలగించాలని అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళాయి. ప్రీ హోల్డ్ భూములపైనా ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగులో అనేఅక సార్లు చర్చించామని తొందరలో సానుకూల నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
పట్టాదారు పాసు పుస్తకాలు :
ఇదిలా ఉంటే జనవరి 2 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల 80 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 9వ తేదీన ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని చెబుతున్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖలోనూ చాలా మార్పులు ప్రభుత్వం తీసుకుని వస్తోంది. ఇక మీదట నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం నేరుగా కలెక్టర్లకు ఇస్తున్నారు. ఇక ఏపీలో ఎక్కడైనా డబుల్ రిజిస్ట్రేషన్లు కనుక ఉంటే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి అని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. సో భూ అక్రమణదారులు అయినా ఫేక్ రిజిస్ట్రేషన్ తో ఉన్న వారు అయినా డబుల్ రిజిస్ట్రేషన్ తో దందాలు చేసేవారు ఎవరైనా తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు.
