200 కోట్లు.. బాబు చక్రం వేయాల్సిందే.. !
అంటే.. ఈ గడువు మరో 15 రోజుల్లోనే ముగియనుంది. ఇక, ఈ 370 కోట్ల రూపాయల సొమ్ములో ఇప్పటి వర కు ఖర్చు చేసింది... కేవలం 165 కోట్లు మాత్రమే.
By: Garuda Media | 14 March 2026 4:00 AM ISTఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 205 కోట్ల రూపాయల సొమ్ము. దీనిని వినియోగించుకునేందుకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదేదో.. సినిమాటిక్ సంగతి కాదు. వాస్తవం. ఏపీకి సంబంధించి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఇది. మొత్తం 370 కోట్ల రూపాయలను కేంద్రం 2023 నుంచి 2025 అక్టోబరు వరకు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సొమ్ము. దీనిని వినియోగించుకునేందుకు 2026, మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది.
అంటే.. ఈ గడువు మరో 15 రోజుల్లోనే ముగియనుంది. ఇక, ఈ 370 కోట్ల రూపాయల సొమ్ములో ఇప్పటి వర కు ఖర్చు చేసింది... కేవలం 165 కోట్లు మాత్రమే. మిగిలిన 205 కోట్ల రూపాయలు మాత్రం ఖాతాల్లో మూలు గుతున్నాయి. వీటిని ఈ నెల 31లోగా వినియోగించుకోకపోతే.. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాయి. దీంతో ఈ వ్యవహారం.. ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాలన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎందుకు ఇచ్చారు.. ?
రాష్ట్రంలో వైసీపీ హయాంలో కొత్తగా తీసుకువచ్చిన మెడికల్ కాలేజీల నిర్మాణం, వాటిలో ల్యాబుల ఏర్పా టు, మౌలిక సదుపాయాలకల్పనకు కేంద్ర ప్రభుత్వం 370 కోట్ల రూపాయలను ఇచ్చింది. పాడేరు, మచిలీ పట్నం సహా మరో కాలేజీకి ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. అయితే.. వీటిలో కేవలం 165 కోట్లను మా త్రమే ఖర్చు చేశారు. మిగిలిన సొమ్మును మౌలిక సదుపాయాల కల్పనకు, వైద్య పరికరాల కొనుగోలుకు కేటాయించి.. ఖర్చు చేయాలి.
తప్పు ఎవరిది..?
నిధుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అప్పగించింది. ఈ విభాగంలోని ఉన్నతాధికారుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు కారణంగా.. ఎవరికి వారు ఈ విషయాన్ని మీరు చూడాలంటే మీరు చూడాలంటూ.. వదిలేశారు. దీంతో చివరకు ఇటీవల మంత్రి సత్యకుమార్ కు.. కేంద్రం నుంచి తాఖీదు వచ్చింది. సదరు నిధులు ఖర్చు చేశారా? లేదా? చేస్తే.. బిల్లులు ఇవ్వండి అని సమాచారం అందింది. దీనిపై విచారించిన ఆయన నిధులు ఖర్చు చేయలేదని తేలడంతో ఆశ్చర్య పోయారు.
కానీ, మరో 15 రోజుల్లోనే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉండడంతో ఇది సాధ్యం కాదని తేలిపోయింది. కనీసంలో కనీసం మరో 6 మాసాలైనా గడువు కావాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని కేంద్రాన్ని అభ్యర్థిస్తే తప్ప.. సదరు నిధులు రాష్ట్రానికి ఉపయోగపడేలా లేవు. లేకపోతే.. వచ్చిన దారిన వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
