Begin typing your search above and press return to search.

లోకేష్ సూపర్ స్పీడ్.. సీఐఐ సదస్సులో ఎవరి నోట విన్నా చిన్న బాస్ పేరే...

విశాఖలో జరగుతున్న సీఐఐ సమ్మిట్ లో ఐటీ మంత్రి నారా లోకేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

By:  Tupaki Political Desk   |   15 Nov 2025 12:14 PM IST
లోకేష్ సూపర్ స్పీడ్.. సీఐఐ సదస్సులో ఎవరి నోట విన్నా చిన్న బాస్ పేరే...
X

విశాఖలో జరగుతున్న సీఐఐ సమ్మిట్ లో ఐటీ మంత్రి నారా లోకేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పెట్టుబడుల సాధనలో దూకుడుగా వ్యహరిస్తున్న మంత్రి లోకేశ్.. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నారు. ఐటీ మంత్రిగా ఆయన చూపుతున్న చొరవ, ప్రభుత్వం నుంచి వేగంగా అనుమతులు రావడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేశ్ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న లోకేశ్.. పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఏపీకన్నా మెరుగైన పెట్టుబడులను సాధించి అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు లోకేశ్ స్పీడ్ తో వెనక్కి వెళ్లిపోయాయి. కొత్తగా ఎవరు ఏ పరిశ్రమ పెట్టాలన్నా.. అది ఏపీకే రావాలన్నట్లు లోకేశ్ పనిచేస్తుండటంతో ఏపీ పారిశ్రామిక పెట్టుబడులకు గేట్ వేగా మారిపోయిందని అంటున్నారు.

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఐటీ మంత్రిగా ఈ బాధ్యత తీసుకున్న లోకేశ్.. తనదైన స్టైల్ లో పనిచేస్తూ లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేస్తున్నారు. ఏఐ, క్వాంటం, డీప్ టెక్, ఫిన్ టెక్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ ఇలా కొన్ని ప్రాధాన్య రంగాలను తీసుకున్న మంత్రి లోకేశ్... ఆయా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా పనిచేస్తున్నారు. ఆయన కృషికి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతోన్న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ను ఒక ఉదాహరణగా చూపుతున్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో పెట్టుబడి పెట్టేందుకు మిట్టల్ సంస్థ ఆలోచిస్తోందని తెలిసిన వెంటనే.. తమకు ఒక అవకాశం ఇవ్వాలని లోకేశ్ ఆ సంస్థను సంప్రదించారు. ఈ సందర్భంగానే స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని చూపడంతో మిట్టల్ స్టీల్ ఏపీకి తరలివచ్చేసింది. ఇందుకోసం లోకేశ్ పెద్దగా శ్రమపడలేదు. ఒక్క జూమ్ మీటింగుతో మిట్టల్ స్టీల్ ను ఇంప్రెస్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఏపీకి దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. సీఐఐ సదస్సులో మరో పది లక్షల కోట్లు వస్తాయని ముందుగా అంచనా వేశారు. కానీ, సీఐఐ సదస్సు తొలిరోజు ముగిసేనాటికే దాదాపు రూ.12 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో సింహభాగం మంత్రి లోకేశ్ చొరవతో వచ్చినవే అంటున్నారు. అంతేకాకుండా పెట్టుబడి సదస్సులు, ఎంవోయూలపై ఇప్పటివరకు పారిశ్రామిక వర్గాల్లో ఒక అనుమానం ఉండేది. ప్రభుత్వాలు ఏదో హడావుడిలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంవోయూలు కుదుర్చుకున్నా, ఆ తర్వాత అనుమతులు ఇచ్చే విషయంతో తిప్పించుకుంటాయనే విమర్శలు ఉండేవి. కానీ, ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న సీఐఐ సదస్సు ఆ అభిప్రాయాన్ని చెరిపేసింది. ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకున్న వెంటనే.. అక్కడికక్కడే ఆయా పరిశ్రమలకు కావాల్సిన అనుమతి పత్రాలను పారిశ్రామిక వేత్తల చేతిలో పెడుతున్నారు. ఇదంతా యువనేత లోకేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమంటున్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతులు ఆఘమేఘాలపై రావడం చూసిన పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. దేశవిదేశాల్లో తాము ఎన్నో ప్రభుత్వాలను చూశామని కానీ, ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం చూపిస్తున్న చొరవ, దూకుడు, స్పీడు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఈ విషయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు సభా వేదికపైనే ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో 82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న రెన్యూ పవర్ సీఈవో సుమంత్ సిన్హా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రి లోకేశ్ పనితీరును మెచ్చుకుంటూ వేదికపైనే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అప్పటి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించలేదని, కానీ ఇప్పుడు లోకేశ్ చూపిస్తున్న చొరవ, ప్రభుత్వం నుంచి వేగంగా వస్తున్న అనుమతుల వల్ల ఏపీలో 22 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న తాము.. ఇప్పుడు మరో 60 వేల కోట్లకు ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు.

సుమంత్ సిన్హా ఒక్కరే కాదు జర్మనీకి చెందిన ప్రొఫెసర్ బెర్ట్రమ్ లోహ్మ్యులర్, న్యూ ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త పాటిల్, శ్యామ్ మెటాలిక్స్ ఎండీ షీజిత్ అగర్వా, యాక్షన్ టేసా ఎండీ వివేక్ జైన్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీ మల్లికార్జునరావు ఇలా ఎందరో పారిశ్రామిక వేత్తలు ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న వేగాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా లోకేశ్ చొరవను అభినందించారు. వారు, వీరు ఏంటి విదేశీ పారిశ్రామికవేత్తలు సైతం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోడానికి ఉత్సాహం చూపారు. ఈ విధంగా సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. సీఐఐ సదస్సు సక్సెస్ చేయడానికి రెండు నెలల ముందు నుంచే కష్టపడిన ప్రభుత్వం తగిన ఫలితం సాధించింది.