కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే గిరి కోల్పోనున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో దోషిగా తేలడంతో కేరళ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆంటోనీ రాజు తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.
By: Satya P | 5 Jan 2026 9:29 AM ISTదక్షిణాదిన కేరళ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే గిరి కోల్పోనున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో దోషిగా తేలడంతో కేరళ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆంటోనీ రాజు తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రతి అందిన తర్వాత అసెంబ్లీ సచివాలయం దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. నెడుమంగాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ కేసుని విచారించింది. అలాగే ఆంటోనీ రాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుని అనుసరించి చూస్తే కనుక అంటోనీ రాజు రాబోయే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా ఆయనపై నిషేధం విధించబడుతుందని తెలుస్తోంది.
బెయిల్ వరకూ ఓకే :
ఇదిలా ఉంటే ఆంటోనీ రాజుకు పడిన శిక్ష ఏడేళ్ల కంటే తక్కువగా ఉన్నందున ఆయన అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసు విషయం చూస్తే ఎపుడో 34 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించినది అని చెబుతున్నారు. అప్పట్లో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అరవై గ్రాముల హషీష్‌తో అరెస్టు అయిన ఒక ఆస్ట్రేలియా పౌరుడికి సహాయం చేయడానికి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆంటోనీ రాజుపై ఉన్న ఆరోపణలు. అవి రుజువు కావడంతో ఆయన ఇపుడు దోషిగా తేలారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా :
ఆంటోని రాజు కేరళ రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ నాయకుడుగా ఉన్నారు. ఆయన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో అంటే 2021 మే 2 నుండి 2023 డిసెంబరు 24 రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంటోని రాజు కేరళ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన నేతగా ఉన్నారు. ఇక 1991లో తిరువనంతపురం వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం హసన్‌పై చేతిలో ఓడిపోయాడు. అయితే చిత్రంగా ఆయన 1996లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం హసన్‌ను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
గతంలోనూ పోటీకి దూరం :
ఇదిలా ఉంటే ఆంటోని రాజు న్యాయవాద వృత్తిపై వచ్చిన వివాదాల కారణంగా ఆయన 2006, 2011 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. ఆయన 2016లో పోటీ చేసి కేరళ కాంగ్రెస్ అభ్యర్థి రాజు విఎస్ శివకుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక తిరిగి 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశాడు. ఇక ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం కూడా తొందరలో ముగుస్తోంది. ఈ ఏడాదే కేరళలో ఎన్నికలు ఉన్నాయి. దీనికి ముందే తీర్పు రావడంతో ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదు. తిరిగి ఆరేళ్ల తరువాత మాత్రమే. అంటే 2031లో కూడా ఆయన పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. మరి ఏడు పదులకు పైబడిన అంటోనీ రాజు రాజకీయాన్ని కోర్టు తీర్పు ఈ విధంగా మార్చేసింది అని అంటున్నారు.
