Begin typing your search above and press return to search.

ఆంథ్రోపిక్ వెనుక ఉన్నదెవరు? అసలు విషయం తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

ఐటీ షేర్లను వణికించిన ఒక సంస్థ వెనుక ఉన్న అసలు 'వార్ రూమ్' వ్యూహాలేంటి? మిత్రులు శత్రువులైన వేళ.. శత్రువులంతా మిత్రులైన వింతైన కార్పొరేట్ కథ!

By:  Garuda Media   |   5 Feb 2026 12:00 PM IST
ఆంథ్రోపిక్ వెనుక ఉన్నదెవరు? అసలు విషయం తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!
X

ఐటీ షేర్లను వణికించిన ఒక సంస్థ వెనుక ఉన్న అసలు 'వార్ రూమ్' వ్యూహాలేంటి? మిత్రులు శత్రువులైన వేళ.. శత్రువులంతా మిత్రులైన వింతైన కార్పొరేట్ కథ! బుధవారం భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ షేర్లను వణికించిన ఆంథ్రోపిక్ సంస్థ ఎవరిది? అందులో పెట్టుబడి పెట్టినోళ్లు ఎవరు? ఇప్పటివరకు అందులో పెట్టిన పెట్టుబడి ఎంత? దాని మీద ఇప్పటివరకు వచ్చిన ఆదాయం మరెంత? రానున్న రోజుల్లో ఇందులో ఏ మేర పెట్టుబడి పెట్టే వీలుంది? ఇంతకూ ఇదంతా దేని కోసం జరుగుతుంది?

ఈ సంస్థకు పోటీగా ఉన్నదెవరు? వారెలాంటి బలాన్ని కలిగి ఉన్నారు? ప్రపంచంలో జరుగుతున్న ఏఐ యుద్ధంలో ఆంథ్రోపిక్ పాత్ర ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. థ్రిల్లర్ మూవీని చూస్తే కలిగే ఉత్తేజం కలగటమే కాదు.. కార్పొరేట్ ప్రపంచంలో వ్యాపార ఎత్తులు ఎంత కఠినంగా ఉంటాయన్నది అర్థమవుతుంది.

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఏఐలో అధిక్యత కోసం జరుగుతున్న పోరులో ఇదో ఘట్టంగా కనిపించకమానదు. ఇక.. విషయంలోకి నేరుగా వెళ్లిపోతే.. ఆంథ్రోపిక్ అన్నది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక ఏఐ పరిశోధన కం భద్రతా సంస్థ. దీన్ని ప్రారంభించినోళ్ల గురించి తెలిస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. అదే సమయంలో దీనిలో పెట్టుబడి పెట్టినోళ్ల గురించి తెలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. ఇదంతా ఎందుకన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కార్పొరేట్ వ్యాపార తత్త్వం బోధ పడుతుంది.

ఆంథ్రోపిక్ ను 2021లో ప్రారంభించారు. ఓపెన్ ఏఐకు చెందిన మాజీ సభ్యులు డేరియో అమోడెయ్ ఆయన సోదరి డానియెలా అమోడెయ్ లు దీన్ని ప్రారంభించారు. ప్రిన్స్ టన్ వర్సిటీలో ఫిజిక్స్లో పీహెచ్ డీ చేశారు. వీరు ఓపెన్ ఏఐలో కీలక పదవుల్లో ఉండేవారు. డేరియో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ గా ఉంటే.. ఆయన సోదరి డానియోలా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ పాలసీ హోదాలో ఉండేవారు. ఓపెన్ ఏఐకు సంబంధించి జీపీటీ 2, జీపీటీ 3 డెవలప్ చేయటంలో కీలకభూమిక పోషించారు. ఆంథ్రోపిక్ సంస్థలో వీరికి తోడుగా ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన మరో తొమ్మిది మంది నిపుణులు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. తన ప్రయాణ ఆరంభంలో లాభాపేక్ష లేదని చెప్పి.. మానవాళికి ప్రయోజనం చేకూర్చే సురక్షితమైన ఏఐను అందించేందుకు 2015లో ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సంస్థ తీరుతో విభేధించి బయటకు వచ్చేసి ఆంథ్రోపిక్ ను స్టార్ట్ చేశారు.

వ్యాపార లాభాల కంటే నైతికత.. నియంత్రణతో కూడిన ఏఐని రూపొందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆంథ్రోపిక్ ను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో మనిషి కంప్యూటర్ ను ఎలా ఆపరేట్ చేస్తాడో.. క్లౌడ్ కూడా అలాగే ఆపరేట్ చేయాలన్నది ఆంథ్రోపిక్ లక్ష్యం. ఇందులో పెట్టుబడి పెట్టిన వారిలో ఓపెన్ ఏఐలో వాటా ఉన్న మైక్రోసాఫ్ట్ తో పాటు.. గూగుల్.. అమెజాన్ లాంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు.

కంపెనీ ఆరంభం నుంచి ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులు సంస్థల వివరాల్ని చూస్తే.. అమెజాన్ రూ.67వేల కోట్ల వరకు, గూగుల్ రూ.16,700 కోట్లు పెడితే.. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.42వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. మైక్రోసాఫ్ట్ తెలివిగా తన పెట్టుబడితో పాటు తన క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాల కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకునేలా ఒప్పందాన్ని చేసుకుంది. ఎన్విడియా కూడా రూ.11వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సై అంది. చిప్ ల సరఫరాతో కలిపితే ఈ పెట్టుబడి రూ.84 వేల కోట్లను దాటుతుందన్నది వ్యాపార వర్గాల అంచనా. ఇప్పటివరకు వివిధ రూపాల్లో.. వివిధ సంస్థల నుంచి రూ.84 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు నిధులను సేకరించింది.

ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ 2024 చివరి నాటికి రూ.8400 కోట్లు గడిస్తే.. 2025 చివరకు దీని ఆదాయం రూ.42 వేల కోట్లకు చేరుకున్నట్లు చెబుతారు. భారీ సర్వర్ ఖర్చుల నేపథ్యంలో 2027-28 నాటికి ఈ సంస్థ లాభాల్లోకి పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడో మరో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. ఆంథ్రోపిక్ రానున్న మూడేళ్లలో తన తర్వాతి మోడల్స్ కోసం సుమారు రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్ల వరకు అవసరముతాయని అంచనా.

అయితే.. ఈ భారీ మొత్తాన్ని డబ్బు రూపంలో కాకుండా అమెజాన్ (ఎడబ్ల్యూఎస్), గూగుల్ (క్లౌడ్ సర్వీస్), మైక్రోసాఫ్ట్ (అజ్యూర్), ఇతరులు తమ సూపర్ కంప్యూటర్లను ఇవ్వనున్నారు. అంటే.. ఇందులోని వాటాదారులు నేరుగా నగదు రూపంలో కాకుండా వివిధ రూపాల్లో సాంకేతికతను అందించనున్నారు. ఇప్పటికే దీని సేవల్ని దాదాపు 3 లక్షల వ్యాపార సంస్థలు ఉపయోగిస్తున్నట్లు చెబుతారు. ఈ మొత్తం స్టోరీ చదివిన తర్వాత అర్థమయ్యే ఆసక్తికర కోణం ఒక్కటే. ఈ సంస్థలోని భాగస్వాములు వేర్వేరుగా వివిధ విభాగాల్లో వ్యాపార ప్రత్యర్థులు. అదే సమయంలో తమ ఉమ్మడి వ్యాపార ప్రత్యర్థులైన జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ లకు సవాలు విసిరి.. ఏఐ వ్యాపార సామ్రాజ్యంలో తమ సత్తా చాటేందుకు మాత్రం ఉమ్మడి పోరు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

చివరగా ఒక మాట.. ఈ బిలియన్ డాలర్ల యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ ఈ దిగ్గజాల మధ్య నలిగిపోయేది చిన్న స్టార్టప్‌లా లేక వినియోగదారుడి డేటానా? టెక్నాలజీ పేరుతో జరుగుతున్న ఈ 'కార్పొరేట్ గ్యాంబ్లింగ్' లో రేపు సామాన్యుడి స్థానం ఎక్కడ? ఆలోచించాల్సిన విషయం..కాదంటారా?