Begin typing your search above and press return to search.

ఐటీ షేర్లను భయపెట్టిన ఆంథ్రోపిక్ కొత్త టూల్ కతేంటి?

ఇప్పుడు నడుస్తున్నదంతా ఏఐ హవానే. ఏఐ కొత్త టూల్స్ వస్తున్నాయంటే టెక్నో కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

By:  Garuda Media   |   5 Feb 2026 10:39 AM IST
ఐటీ షేర్లను భయపెట్టిన ఆంథ్రోపిక్ కొత్త టూల్ కతేంటి?
X

ఇప్పుడు నడుస్తున్నదంతా ఏఐ హవానే. ఏఐ కొత్త టూల్స్ వస్తున్నాయంటే టెక్నో కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న పని విధానాన్ని.. ప్రాసెస్ ను సమూలంగా మార్చేస్తున్న కొత్త టూల్స్ ను అర్థం చేసుకోవటం.. వాటి కారణంగా తమకు జరిగే నష్టం ఎంతన్న దానిపై విపరీతమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఉదాహరణగా బుధవారం నాటి భారత స్టాక్ మార్కెట్ లో నెలకొన్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది. ఏఐ కొత్త టూల్ ఒకటి వస్తుందని.. దాని కారణంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్న అంచనాతో భారత ఐటీ కంపెనీల షేర్లు ఎంతలా ప్రభావితం అయ్యాయో మార్కెట్ ను చూస్తే అర్థమవుతుంది.

ఇంతకూ భారత ఐటీ కంపెనీలకు చెమటలు పట్టించిన ఈ కొత్త ఏఐ టూల్ ఏంటి? దాని కతేంటి? ఎందుకంతగా ఐటీ కంపెనీల షేర్లు ప్రభావితం అయ్యాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. క్లాడ్ చాట్ బాట్ క్రియేటర్.. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవల క్లాడ్ కోవర్క్ ఏజెంట్ కు 11 ఓపెన్ సోర్స్ ప్లగ్ ఇన్ లను రిలీజ్ చేసింది. ఇంతకూ ఇది చేసే పనేమిటంటే..లీగల్.. సేల్స్.. మార్కెటింగ్.. డేటా అనాలసిస్ లాంటి రంగాల్లో ఆటోమేషన్ కోసం ఈ ప్లగ్ ఇన్ లు ఉపయోగపడుతున్నాయి.

ఫైనాన్స్.. ప్రొడక్ట్ మేనేజ్ మెంట్.. బయాలజీ రీసెర్చ్.. కస్టమర్ సపోర్టు లాంటి రంగాల్లోనూ ఈ ఏఐ టూల్ పని చేస్తుందన్నది కంపెనీ మాట. ఈ కొత్త టూల్ విలక్షణత ఏమంటే.. ఇది చాట్ బాట్ మాత్రమే కాదు.. అంతకు మించింది. అదెలా అంటే.. ఇదో టీమ్ మేట్ లా పని చేస్తుంది. మన కంప్యూటర్ మీద కూడా పని చేస్తుంది. దీనికే ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. విస్మయానికి గురయ్యే విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయి మరి.

ఈ టూల్ ఏజెంట్ ఫైల్స్ ను చదవగలదు.. డాక్యుమెంట్లను ఎడిట్ చేయగలదు.. కొత్త ఫైల్స్ క్రియేట్ చేసి.. కొత్త పేర్లతో సరికొత్తగా చేయగలదు.. ఫోల్డర్లను ఒక పద్దతి ప్రకారం సర్దిగలదు.. నోట్స్ ను రిపోర్టుగా మార్చగలదు. అంటే.. సిస్టమ్ ముందు కూర్చున్న ఒక టెక్నోక్రాట్ ఏ పనులైతే చేస్తారో.. దాదాపు అవన్నీ ఎవరి సాయం లేకుండా.. వాయు వేగంతో చేసేయగలరదు. దీన్ని రచయతలు.. అనలిస్టులు.. జర్నలిస్టులు.. విద్యార్థులు.. ఆఫీసు యూజర్లు దీన్ని ఉపయోగించుకునే వీలుంది.

అంతేకాదు.. లాయర్ల కోసం కంపెనీల కోసం ఈ టూల్ లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. కంపెనీల కోసం కూడా ప్రత్యేక టూల్స్ ఉన్నాయి. ఐటీ కంపెనీలకు పలు పెద్ద పెద్ద కంపెనీలు డాక్యుమెంట్ రివ్యూలు.. డేటా అనాలిసిస్ లాంటి పనులను భారత ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు ఔట్ సోర్సింగ్ కింద ప్రాజెక్టుల కింద ఇస్తుంటాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ టూల్ తో ఆ అవసరం లేకుండా పోతుంది. ఆటోమేటిక్ గా అదంతా నిమిషాల్లో చేసి పెడుతుంది. దీంతో.. ఈ తరహా సేవలు అందించే భారత దిగ్గజ ఐటీ కంపెనీల (ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో, టెక్ మహింద్రా, హెచ్ సీఎల్, ఎంఫసిస్ తదితర) షేర్లు నేటి ట్రేడింగ్ లో భారీగా నష్టపోయాయి.

ఈ ఏఐ టూల్ దెబ్బకు పలు ఐటీ కంపెనీల్లో కొత్త గుబులు మొదలైంది. ఇప్పటివరకు కంపెనీలకు ఏఐ టూల్స్ సాయం చేయగలవు అన్న భావన నుంచి కంపెనీలను ఏఐ భర్తీ చేస్తుందన్న చర్చ మొదలైంది. ఈ తరహా ఏఐ టూల్స్ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉండే డెవలప్ మెంట్.. టెస్టింగ్ వంటి టాస్కులను ఈ టూల్ భర్తీ చేయటమే కాదు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు డేంజర్ లో పడే ప్రమాదం ఉందంటున్నారు. బుధవారం నాటి మార్కెట్ ను చూస్తే.. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థల షేర్లు దాదాపు ఏడు శాతం కుంగిపోవటం చూస్తే..ఈ ఏఐ టూల్ ఫోబియో మార్కెట్ మీద ఎంత ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.