4 ఏళ్లు రూ.లక్ష కోట్లు.. రోజులో రూ.2 లక్షల కోట్ల లాస్!
ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఏళ్లకు ఏళ్లుగా ఐటీ రంగంలో సేవలు అందించి.. భారత దిగ్గజ ఐటీ సంస్థలుగా ఉన్న కంపెనీలకు రోజులో దిమ్మ తిరిగే ఆర్థిక షాక్ ఇచ్చింది నాలుగేళ్ల వయసున్న కంపెనీ.
By: Garuda Media | 5 Feb 2026 11:00 AM ISTఇటుక ఇటుక పేర్చుకుంటూ ఏళ్లకు ఏళ్లుగా ఐటీ రంగంలో సేవలు అందించి.. భారత దిగ్గజ ఐటీ సంస్థలుగా ఉన్న కంపెనీలకు రోజులో దిమ్మ తిరిగే ఆర్థిక షాక్ ఇచ్చింది నాలుగేళ్ల వయసున్న కంపెనీ. అదే.. ఆంథ్రోపిక్. నాలుగేళ్లలో ఈ సంస్థ లో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టి.. తయారు చేసిన తాజా ఏఐ టూల్ వివరాలు బయటకు రావటంతో భారత ఐటీ పరిశ్రమకు చెందిన దిగ్గజ కంపెనీలు స్టాక్ మార్కెట్ లో కోల్పోయిన మార్కెట్ విలువ అక్షరాల రూ2 లక్షల కోట్లు. ఇది ఇక్కడితో ఆగుతుందా? అంతకంతకూ పెరుగుతుందా? అన్నది ఇప్పుడు భారత ఐటీ కంపెనీలను వేధిస్తోన్న ప్రశ్న,
ఆంథ్రోపిక్ సంస్థ తాను రూపొందించిన సరికొత్త ఏఐ టూల్ తో.. భారత ఐటీ సంస్థలు అందించే సేవల్ని దెబ్బ తీయటమే కాదు.. ఆ స్థానాన్ని తాను భర్తీ చేస్తుందని.. ఐటీ కంపెనీలకు చెల్లించే మొత్తంతో పాటు.. సేవలు అందించేందుకు తీసుకునే సమయంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలోనూ అనూహ్య ఫలితాలు అందించే అవకాశం ఉందన్న అంచనాలు భారత ఐటీ కంపెనీల్ని ఘోరంగా దెబ్బ తీశాయి.
మరింత వివరంగా చెప్పాలంటే.. భారత ఐటీ కంపెనీలు తాము సేవలు అందించే సంస్థల నుంచి మానవ గంటల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తాయి. ఈ పనిని ఏఐ సెకన్లలో పని పూర్తి చేస్తుంది. అంటే.. ఎవరైనా రూ.100తో అయ్యే పనిని రూపాయికే చేస్తామని ముందుకు వస్తే ఎలా ఉంటుంది. ఆంథ్రోపిక్ చేస్తున్నది ఇదే. అందుకే.. అంత ఐటీ సంస్థల షేర్లకు స్టాక్ మార్కెట్ లో అంత అలజడికి గురయ్యాయి. బుధవారం స్టాక్ మార్కెట్ లో భార ఐటీ సంస్థలకు జరిగిన రూ.2లక్షల కోట్లలో.. టీసీఎస్.. ఇన్ఫోసిస్ కంపెనీలు కోల్పోయిన మార్కెట్ విలువ రూ.1.2 లక్షల కోట్లు కావటం గమనార్హం. దీని దెబ్బకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆరు శాతానికి పైగా పడిపోయింది.
ఆంథ్రోపిక్స్ సంస్థ తన నాలుగేళ్ల ప్రస్థానంలో పెట్టిన పెట్టుబడి రూ.లక్ష కోట్లు మాత్రమే. కానీ.. ఇది ఒక్క రోజులో భారత ఐటీ రంగానికి రూ.2లక్షల కోట్ల షాకిచ్చింది. ఒక కొత్త టెక్నాలజీ దెబ్బకు దశాబ్దాల అనుభవంతో.. తమ రంగంలో సామ్రాజ్యాలుగా నిలిచిన కోట గోడల్ని ఒక్క దెబ్బకు భారీగా దెబ్బ తీసిన వైనం రానున్న రోజుల్లో మరెంత నష్టాన్ని కలిగిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్న.
తాను తయారు చేసిన టూల్ గురించి ఆంథ్రోపిక్స్ చేస్తున్న ప్రచారంతో భారత ఐటీ సంస్థకు తగిలిన మొదటి దెబ్బగా దీన్ని చెప్పాలి. అయితే.. ఇదంతా కంటిన్యూ అవుతుందా? అంటే.. అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. వ్యాపార సామ్రాజ్యం ఏదీ ఒక్కరోజులో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోదు. కాకుంటే భారీ నష్టాన్ని కలిగించి..కోలుకునేందుకు దీర్ఘకాలం పట్టే వీలుంది. అయితే.. ఇప్పటివరకు తాను అనుసరించిన విధానాల్ని తక్షణమే మార్చుకొని.. వాయువేగంగా తన సేవల తీరును మార్చుకుంటే ఈ నష్టం న్యూట్రల్ అయ్యే వీలుంది. అదే సమయంలో విపరీతమైన హైప్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆంథ్రోపిక్ కు.. దాని ఎలివేషన్ కు తగ్గట్లుగా దాని సామర్థ్యం ఉందా? లేదా? అన్న మదింపు ఇప్పుడు మొదలవుతుంది.
వ్యాపార ప్రపంచంలో అనుభవం ఒక ఆయుధం అయితే.. సాంకేతికత మరొక ఆయుధం. మన ఐటీ దిగ్గజాలు తమ అనుభవానికి, ఈ కొత్త సాంకేతికతను జోడిస్తే.. ఈ 'ఆంథ్రోపిక్ దెబ్బ'కు సరైన సమాధానం దొరుకుతుంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది! భారత ఐటీ కంపెనీలు సైతం తమ సేవల్లో ఏఐ సాయాన్ని జత చేయటంతో పాటు.. తమ మానవవనరుల్ని ఏఐ చేయలేని అంశాల మీద మరింత ఫోకస్ చేయించాల్సి ఉంటుంది.
తాను తోపునని.. భారత ఐటీ సంస్థలు ఇంతకాలం అందించిన సేవల్ని తాను సులువుగా చేసేస్తానని ఆంథ్రోపిక్ చెబుతోంది. అయితే.. దీని సామర్థ్యానికి జరిగే లిట్మస్ పరీక్షలో అది పాస్ అయితే మాత్రం భారత ఐటీ సంస్థలకు గడ్డు రోజులే అని చెప్పాలి. అదే సమయంలో.. ఫలితం కాస్త అటు ఇటూ ఉన్నా.. ఆంథ్రోపిక్ కు జరిగే నష్టం భారీగా ఉండదు. ఎందుకెంటే.. ప్రాథమిక దశలో (బీటా వెర్షన్) తాము ఉన్నామని.. రానున్న రోజుల్లో తాము మరింత మెరుగైన సేవల్ని అందించేలా సిద్ధమవుతున్నామని కవర్ చేసే వీలుంది. ఈ తరహా వాదన కారణంగా ఆంథ్రోపిక్ కు ఊపిరి పీల్చుకునే సమయం దక్కుతుంది. అదే సమయంలో తమకు ఎదురైన భారీ దెబ్బను రాబోయే రోజుల్లో పెను ముప్పుగా మారుతుందన్న విషయాన్ని భారత ఐటీ కంపెనీలు గుర్తించి.. తక్షణ చర్యల దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది కాలం కంటే మరెవరూ సరైన అంచనా వేయలేరనే చెప్పాలి.
