ఆంథ్రోపిక్: రూ.1030 కోట్ల పెట్టుబడి.. తొలి ఏడాది ఆదాయం సున్నా
ప్రపంచ టెక్ రంగాన్ని ఆంథ్రోపిక్ క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. కొత్త ఏఐ మోడళ్లతో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
By: Garuda Media | 26 Feb 2026 3:00 PM ISTప్రపంచ టెక్ రంగాన్ని ఆంథ్రోపిక్ క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. కొత్త ఏఐ మోడళ్లతో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. దీంతో.. ఈ సంస్థ మార్కెట్ విలువ అనతికాలంలో రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచంలో మరే టెక్ కంపెనీ సాధించని ఎన్నోరికార్డుల్ని ఆంథ్రోపిక్ సొంతం చేసుకుంటోంది. ఐదేళ్ల క్రితం స్టార్టప్ గా మొదలెట్టిన ఈ సంస్థ.. ఈ రోజున మార్కెట్ విలువలో దిగ్గజ టెక్ కంపెనీల్ని ఇట్టే దాటేస్తోంది. సింఫుల్ గా చెప్పాలంటే ఆంథ్రోపిక్ దూకుడుకు తోపు టెక్ కంపెనీలు సైతం బెంబేలెత్తిపోతున్నాయి.
దీంతో.. ఆంథ్రోపిక్ తో జత కట్టేందుకు.. దాని టూల్స్ ను వాడుతున్నట్లుగా ప్రకటించటం ద్వారా మార్కెట్ లో తన ఇమేజ్ ను కాపాడుకోవటమే కాదు.. మార్కెట్ లో తన ముఖ విలువను కాపాడుకోవటం ఆసక్తికరంగా మారింది. తాజాగాఈ సంస్థ విలువ అనేక టెక్ దిగ్గజాల్ని దాటేసింది. ఈ రోజున ఆంథ్రోపిక్ విలువ ఏకంగా 380 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే..అక్షరాల రూ.34.54 లక్షల కోట్లుగా లెక్క వేస్తున్నాయి.
ఓపెన్ ఏఐ నుంచి కొందరు బయటకు వచ్చి.. సొంతంగా మొదలెట్టిన ఈ స్టార్టప్ దెబ్బకు తిరుగులేని సత్తా చాటే టెక్ కంపెనీలు సైతం ఈ రోజున హడలిపోయే పరిస్థితి. ఇక్కడే ఆంథ్రోపిక్ గురించి కొన్ని ఆసక్తికర అంశాల్ని చెబితే విస్మయానికి గురి కావటం ఖాయం. 2021లో ఈ సంస్థను ప్రారంభించారు. దీన్ని ఆరంభించే వేళలో దీని మీద పెట్టిన పెట్టుబడి లెక్క గురించి తెలిస్తే అవాక్కు కావటం ఖాయం. ఆ రోజున (అంటే 2021లో) రూ.1030 కోట్ల భారీ మొత్తంతో దీన్ని ఏర్పాటు చేశారు. మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఈ కంపెనీ ఏర్పాటు చేసిన మొదటి ఏడాది దాని ఆదాయం అక్షరాల సున్నా కావటం గమనార్హం.
ఈ సంస్థ తన మొదటి ప్రొడక్ట్ ను 2023 మార్చి 14న అధికారికంగా మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే.. దీనికి కాస్త ముందే క్లోజ్డ్ బీటా వెర్షన్ ను పరీక్షలు నిర్వహించింది. ఆంథ్రోపిక్ తన మొదటి ఆదాయాన్ని 2022 జనవరిలో నమోదు చేసింది. ఈ ఏడాది ఈ సంస్థ దాదాపు రూ.83 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో 2023లో సుమారు రూ.830 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
2026 ఫిబ్రవరి నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళుతున్న సంస్థగా ఆవతరించటం గమనార్హం. ఇప్పుడు సంస్థ వార్షిక ఆదాయం ఊహించని రీతిలో పెరిగింది. ఇప్పుడు ఈ సంస్థ ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.15 లక్షల కోట్లు. సాఫ్ట్ వేర్ రంగ చరిత్రలోనే అత్యంత వేగమైన వృద్ధిగా దీన్ని పేర్కొనాలి. ఇక్కడే ఈ సంస్థకు చెందిన రెండు నమ్మలేని నిజాల్ని ఇక్కడ ప్రస్తావించాల్సిందే. అదేమంటే.. ఈరోజున ఇంత భారీగా ఆదాయాన్ని జనరేట్ చేస్తున్న ఆంథ్రోపిక్ ఈ రోజుకు నష్టాల్లోనే ఉంది.
అదే సమయంలో లాభాల్లోకి రావటానికి మరికొంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏఐ మీద పెడుతున్న ఖర్చే ఇందుకు కారణంగా చెప్పాలి. ఏఐ మోడళ్ల శిక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాదిలో కేవలం కొత్త ఏఐ మోడళ్లను తయారు చేయటానికే రూ.99,600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకే.. ఈ సంస్థ భారీగా ఆదాయాన్ని నమోదు చేసుకున్నప్పటికి నేటికి ఈ సంస్థ నికరంగా నష్టాల్లోనే నడుస్తోంది. అయితే.. తమ మీద తమకున్న నమ్మకంతో పాటు.. తాము తీసుకున్న నిర్ణయాలు కచ్ఛితంగా కాసులు కురిపిస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఉంది ఆంధ్రోపిక్స్. సాహసం.. పక్కా లెక్కలతో ముందుకు వెళుతున్న సంస్థగా ఆంధ్రోపిక్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని చెప్పక తప్పదు.
