Begin typing your search above and press return to search.

అర కిలోమీటరు వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో జనం!

అవును... అంతర్వేది బీచ్‌ లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది.

By:  Raja Ch   |   29 Sept 2025 5:27 PM IST
అర కిలోమీటరు వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో జనం!
X

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిలో సముద్రం (బంగాళాఖాతం) సయ్యాట ఆడుతోంది. ఇందులో భాగంగా.. నిత్యం అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి ఈ రోజు ఉదయం అర కిలోమీటరు (500 మీటర్లు) వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తచేస్తున్నారు.

అవును... అంతర్వేది బీచ్‌ లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇది సునామీకి సంకేతం అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీచ్‌ లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి బయటపడడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని గంటల తర్వాత మధ్యాహ్నం సమయానికి సముద్రం మళ్లీ ముందుకు వచ్చింది. సముద్ర కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఇలా ఉదయం అర కిలోమీటర్ వెనక్కి వెళ్లి, మధ్యాహ్నానికి భారీ అలలతో ముందుకు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలా వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం జరిగాయి కానీ... ఈ స్థాయిలో ఏకంగా అరకిలోమీటర్ మేర ఎప్పుడు వెనక్కి వెళ్లలేదు. ఇదే సమయంలో.. ఈ స్థాయిలో ఒడ్డున ఒండ్రు మట్టి కనిపించిందీ లేదని స్థానికులు చెబుతున్నారు.

కాగా... బంగాళాఖాతంలోకి గోదావరి వశిష్ట నది కలిసే ప్రదేశంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం అంతర్వేది. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది.