Begin typing your search above and press return to search.

సత్యదేవుడి ప్రసాద విక్రయ కేంద్రంలో అపచారం.. ప్రభుత్వం సీరియస్

ఏపీలో హిందూ ఆలయాల్లో ఏదో ఒక సంఘటన కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకల సంచారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

By:  Tupaki Political Desk   |   24 Jan 2026 1:47 PM IST
సత్యదేవుడి ప్రసాద విక్రయ కేంద్రంలో అపచారం.. ప్రభుత్వం సీరియస్
X

ఏపీలో హిందూ ఆలయాల్లో ఏదో ఒక సంఘటన కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకల సంచారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సత్యదేవుడి ప్రసాదాన్ని ఎలుకలు తినడం, దాన్నే విక్రయించడం విమర్శలకు దారితీసింది. కొందరు భక్తులు ప్రసాద విక్రయ కేంద్రంలో ప్రసాదం ఉంచిన బుట్టలపై ఎలుకలు ఉండటాన్ని గుర్తించి వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం వెలుగుచూసింది.

అన్నవరం ఆలయం ఇటీవల వరుస వివాదాలకు కేంద్రం అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుడి నమూనా ఆలయం ప్రసాదం కౌంటరులో భక్తులకు విక్రయించే ప్రసాదం పొట్లాలపై బుధవారం రాత్రి ఎలుకలు పరుగులు తీస్తున్నట్లు భక్తులు గుర్తించారు. భక్తులకు విక్రయిస్తున్న ప్రసాదాలను ఎలుకలు తినడం, వాటినే భక్తులకు విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై కౌంటరులో ఉన్న సిబ్బందిని భక్తులు ప్రశ్నిస్తే వారు సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

భక్తులు తీసిన వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి పేషీ నుంచి దేవస్థానం అధికారులను వివరణ కోరారు. దీంతో ఆలయ అధికారులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. తిరుపతి లడ్డూ ప్రసాదం తర్వాత అంత పవిత్రంగా సత్యదేవుడి ప్రసాదాన్ని భావిస్తారు. ఈ ప్రసాదాన్ని రత్నగిరిపై రెండుచోట్ల కొండ దిగువన పావంచా, జాతీయ రహదారిపై పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద ఉన్న ప్రసాదం విక్రయిస్తారు. కేవలం ప్రసాద విక్రయాల ద్వారానే ఆలయానికి ఏటా రూ.25 కోట్ల ఆదాయం వస్తోంది. వ్రతాల తరువాత ఆ స్థాయిలో ప్రసాదం విక్రయం ద్వారానే ఆదాయం సమకూరుతోంది. అయితే జాతీయరహదారి పక్కన ఉన్న ప్రసాద విక్రయ కౌంటరుకు సరైన వసతులు లేకపోవడం వల్ల ఎలుకలు చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం నాలుగుచోట్ల ప్రసాదాలను విక్రయిస్తుండగా, రత్నగిరి, పాత పావంచా, నూతన నమూనా ఆలయం వద్ద విక్రయశాలలు పక్కా భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పాత నమూనా ఆలయం వద్ద మాత్ర మెష్ తో చేసిన కౌంటర్లలో ప్రసాదాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఇక్కడ షెల్టర్, క్యూలైన్లు కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కౌంటర్ల ద్వారా ఏటా రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయినప్పటికీ పక్కా భవనాల నిర్మాణంపై ఆలయ అధికారులు దృష్టి పెట్టలేదంటున్నారు. ఈ ప్రసాదం కౌంటర్లకు రంధ్రాలు ఉండటంతో ఎలుకలు లోపలకు వచ్చి స్వామివారి ప్రసాదం ఆరగిస్తున్నాయి.

పగలు రాకపోయినా, రాత్రి 10 గంటల తరువాత ఇక్కడ ఎలుకలు స్వైరవిహారం కొనసాగుతోంది. అయితే, రాత్రి వేళ ప్రసాదం విక్రయాలు తక్కువగా ఉండటంతో సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, పాత నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటరులో ఎలుకలు తిరుగుతున్న వీడియోను దేవస్థానం ఈవో త్రినాథరావు పరిశీలించారు. చాలా కాలం నుంచే ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నప్పటికీ అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడ ప్రసాదం విక్రయించే ఉద్యోగి వై.త్రిమూర్తులుతోపాటు సెక్యూరిటీ గార్డును శుక్రవారం సస్పెండ్ చేశారు. ప్రసాదం కౌంటరుకు ఉన్న రంధ్రాలను రేకుతో మూసివేయించి, మెష్ చుట్టూ అద్దాలు కూడా బిగించారు.