Begin typing your search above and press return to search.

కూటమిలో రాజ్యసభ రగడ.. చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్న బీజేపీ?

బీజేపీ తరుఫున ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు నేత అన్నామలైని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   17 May 2026 5:00 AM IST
కూటమిలో రాజ్యసభ రగడ.. చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్న బీజేపీ?
X

బీజేపీ తరుఫున ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు నేత అన్నామలైని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ కూటమిలో తీవ్ర చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే రెండు స్థానాలు తీసుకున్న బీజేపీ, త్వరలో జరిగే ఎన్నికల్లోనూ మరోసీటు కోరుతుండటంపై టీడీపీలో మింగుడు పడని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. పార్టీలో తీవ్రమైన పోటీ ఉండగా, బీజేపీ ప్రతిసారి రాజ్యసభ సీటును ఆశిస్తుండటం సరికాదని టీడీపీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోందని అంటున్నారు. కూటమి ధర్మం కింద ఇప్పటివరకు తాము ఏమీ అనలేకపోతున్నామని, కానీ వరుసగా రాజ్యసభ స్థానాలు తీసుకుంటే పార్టీలో ఆశావహులకు న్యాయం చేసేది ఎలా అంటూ టీడీపీ సీనియర్లు అధిష్టానాన్ని నిలదీస్తున్నట్లు చెబుతున్నారు.

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు, టీడీపీ నుంచి ఒకరు ఈ నెలలో రిటైర్ అవుతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ నాలుగు సీట్లను కూటమి సునాయాశంగా గెలుచుకుంటుందని చెబుతున్నారు. అయితే ఈ నాలుగు సీట్లను కూటమి పార్టీలు ఎలా పంచుకుంటాయనేదే ఇప్పుడు విస్తృత చర్చగా మారింది. కూటమిలో మూడు పార్టీలలో టీడీపీ, జనసేనకు క్షేత్రస్థాయిలో బలం, బలగం ఎక్కువని అంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు సమానంగా అవకాశాలను ఆశిస్తోందని చెబుతున్నారు. ఇదే టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగితే, ఈ రెండు సార్లు బీజేపీ ఒక్కోసీటును తీసుకుంది. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా కూటమిలోని కీలక పార్టీ జనసేనకు ఇప్పటివరకు రాజ్యసభ బెర్తు దక్కలేదు. దీంతో ఈ సారి జనసేన పార్టీకి కచ్చితంగా అవకాశం ఇవ్వాల్సివుంటుందని అంటున్నారు. ఇక మిగిలిన మూడు సీట్లను టీడీపీ తీసుకోవాలని పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానం మాత్రం తన వైఖరిని బయటపడటం లేదు. కేంద్రంలో బీజేపీ సహకారం అవసరం అవడంతో ఆచితూచి స్పందించాలని హైకమాండ్ ఆలోచనగా ఉందని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అస్సలు వెనక్కి తగ్గేదేలే అన్నట్లు సంకేతాలు పంపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలో ఇతర పార్టీలతో సంప్రదించకుండా తన పార్టీ అభ్యర్థిగా అన్నామలైని పోటీకి దించనున్నట్లు బీజేపీ వర్గాలలో జరుగుతున్న చర్చ కూటమి రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోందని అంటున్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసేవారు. రాజకీయాలపై ఆసక్తితో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆయనకు న్యాయం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. తమిళనాడులో బీజేపీకి బలం లేకపోవడం, మిత్రపక్షం అన్నాడీఎంకేలో చీలిక రావడంతో భవిష్యత్తులోనూ ఆ రాష్ట్రం నుంచి అన్నామలైని రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపించడం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ఏపీ నుంచి అన్నామలైకి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. మొత్తానికి బీజేపీ వైఖరి ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీని ఇరుకున పడేసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.