Begin typing your search above and press return to search.

బీజేపీకి భారీ షాక్ ఇస్తున్న అన్నామలై ?

అన్నామలై అంటే జాతీయ రాజకీయాల అవగాహన ఉన్న ఆరికి తెలిసిన పేరే. ఆయన తమిళనాడు బీజేపీకి కొన్నాళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు.

By:  Satya P   |   2 Jun 2026 9:01 AM IST
బీజేపీకి భారీ షాక్ ఇస్తున్న అన్నామలై ?
X

అన్నామలై అంటే జాతీయ రాజకీయాల అవగాహన ఉన్న ఆరికి తెలిసిన పేరే. ఆయన తమిళనాడు బీజేపీకి కొన్నాళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కర్ణాటక ఐపీఎస్ క్యాడర్ కి చెందిన యువ అధికారి. నిబద్ధత కలిగిన వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన బీజేపీ సిద్ధాంతాలు నచ్చి తన పోలీస్ ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి మరీ ఆ పార్టీలో ఆరేళ్ల క్రితం చేరారు. అయితే అన్నామలై చేరాక బీజేపీకి తమిళనాడులో ఊపు వచ్చిన మాట వాస్తవం. ఆయన తమిళనాడు అంతటా పర్యటించారు పాదయాత్రలు చేశారు సనాతన ధర్మం గురించి డీఎంకే ను సవాల్ చేస్తూ ఎన్నో ఆవేశపూరితమైన ప్రసంగాలు చేశారు. బస్తీ మే సవాల్ అంటూ గట్టిగా నిలబడ్డారు. అయితే ఆయనకు తమిళనాడు బీజేపీలో కొందరు సీనియర్లకు గ్యాప్ ఉంది. కొత్తగా వచ్చి రాష్ట్ర పగ్గాలు చేపట్టి ఎదిగిపోతున్నారు అన్న భావన కొందరిలో ఏర్పడింది.

ఢిల్లీ పెద్దల ఆశీస్సులు :

ఇక అన్నామలై మీద ఫిర్యాదులు చేయడానికి బీజేపీ కేంద్ర పెద్దల వద్దకు వెళ్తే వారికే క్లాస్ తీసుకుని ఆయన్ని ప్రోత్సహించిన పరిస్థితి కూడా అంతా చూశారు. దాంతో ఇలా లాభం లేదనుకుని మిత్ర పక్షం అన్నాడీఎంకే ద్వారా చెప్పించారు. అన్నామలై ఉంటే తాము పొత్తులకు రామని పనిచేయమని ఎన్నికలకు ఏడాది ముందు అన్నా డీఎంకే పెద్దలు చెప్పడంతో చేసేది లేక కేంద్ర బీజేపీ పెద్దలు అన్నామలైని తప్పించి పాత సీనియర్ బీజేపీ నేతలలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామని అన్నామలై ఎంతో ఆశపడినా ఆయన కోరుకున్న సీటు అయితే అన్నా డీఎంకే పెద్దలు ఇవ్వలేదు. దాంతో చేసేది లేక ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ సీనియర్ల సారధ్యంతో పాటు అన్నా డీఎంకే కర్ర పెత్తనం తోడు అయి 2021లో నాలుగు అసెంబ్లీ సీట్లు సాధించిన బీజేపీ ఈసారి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన కొన్ని వందల ఓట్లతో ఒక్క సీటు గెలిచింది.

తీవ్ర అసంతృప్తితో :

అయితే ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర బీజేపీ పెద్దల సూచనలతో నిర్వహించిన అన్నామలై ఫలితాలు వచ్చిన తరువాత నుంచి ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆయన పూర్తి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తమిళనాడు బీజేపీ సీనియర్లు అయితే ఆయనకు పదవులు దక్కడం సహించేలా లేరు. కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కమలానికి గుడ్ బై కొట్టే ఆలోచనలలో ఉన్నారని అంటున్నారు.

పుట్టిన రోజు వేళ :

ఇక తన పుట్టిన రోజు జూన్ 4వ తేదీన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు మీద అన్నామలై సంచలన ప్రకటన చేస్తారు అని అంటున్నారు. బీజేపీకి తమిళనాడులో బలం పూర్తిగా క్షీణించిందని ఆయన గ్రహించారు అని అంటున్నారు. టీవీకే విజయంతో కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడిందని ఆయన అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని భావించి దానిని భర్తీ చేయడానికి తానే సొంతగా రాజకీయ పార్టీ పెడితే బాగుంటుంది అన్న సన్నిహితుల సూచనల మేరకు ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు అని అంటున్నారు. అన్నా మలై కనుక కొత్త పార్టీ దిశగా నిర్ణయం తీసుకుంటే మాత్రం బీజేపీకి తమిళనాడులో బిగ్ షాక్ తగిలినట్లే అని అంటున్నారు. పోలీస్ సింహం గా పేరు గడించి సరికొత్త ఇమేజ్ తో జనాలను ఆకట్టుకుంటున్న అన్నామలై వంటి యువ నేతను కోల్పోతే బీజేపీకి భవిష్యత్తు ఆశలు కూడా అక్కడ అడుగంటిపోయినట్లే అని అంటున్నారు. చూడాలి మరి కేంద్ర బీజేపీ నాయకత్వం ఆయనను బుజ్జగించి తమ పార్టీలో కొనసాగేలా చూస్తుందా లేదా అన్నది.