Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజల్లో శరవేగంగా పెరుగుతున్న 'అనా కొణిదెల' ఇమేజ్!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ఇటీవల పిఠాపురం - కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తీరు తెలుగు ప్రజలను, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్ర‌జ‌లు- ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

By:  Sivaji Kontham   |   15 Aug 2026 9:34 AM IST
తెలుగు ప్రజల్లో శరవేగంగా పెరుగుతున్న అనా కొణిదెల ఇమేజ్!
X

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ఇటీవల పిఠాపురం - కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తీరు తెలుగు ప్రజలను, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్ర‌జ‌లు- ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెద్ద నగరాల హడావుడికి దూరంగా పిఠాపురానికి సాధారణ ప్రయాణికురాలిగా రైలులో రావడం... పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాధించడంపై ఆమె సోషల్ మీడియాలో వ్యక్తపరిచిన భావాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అనా కొణిదెల షేర్ చేసిన ప్రేమ‌- అనుభూతులు... సాధారణ జీవనశైలి సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుండి విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి.

విమానాలు, కాన్వాయ్‌ల ఆడంబరం లేకుండా రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం... గ్రామీణ వాతావరణాన్ని ప్రేమించడం ఆనా కొణిదెలలోని వినయాన్ని చాటిచెబుతోంది. సాధారణమైన జీవితానికి, మనశ్శాంతికి ఇచ్చే ప్రాధాన్యతను అనా సామాజిక మాధ్య‌మాల‌లో ప‌వ‌న్ అభిమానుల‌కు వివరించిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి తగ్గట్టుగానే విదేశీ అయిన అనా కూడా ఎంతో సింపుల్ గా అందరితో ఆప్యాయంగా కలిసిపోవడం చూసి ``మా పవన్ అన్న కంటే మీకే ఎక్కువ ఫ్యాన్ అవుతున్నాం`` అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలు, హిందూ ఆచారాలపై ఆనా కొణిదెల చూపుతున్న గౌరవానికి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సమయంలో వ‌దిన‌మ్మ‌ అనా ధరించిన పద్ధతిగల చీరకట్టు, పసుపు-కుంకుమల బొట్టు చూసి అభిమానులు.. అలాగే తెలుగు ప్రజలు మనసారా అభినందిస్తున్నారు. ఒక విదేశీ మూలాలు ఉన్న మహిళ అయి ఉండి కూడా మన భారతదేశ సంప్రదాయాలను, సంస్కృతిని ఇంతగా గౌరవించడం అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

పిఠాపురం ఓటర్లలో జనసేన శ్రేణుల్లో అనా కొణిదెల‌ స్థానం ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. నెటిజన్లు , స్థానిక ప్రజలు ఆమెను అభిమానంగా `పిఠాపురం MLA గారి సతీమణి తాలూకా` అని, `మా వదినమ్మ` అని సంబోధిస్తూ నెత్తిన పెట్టుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాస్తా ఇలా ప్ర‌మోట్ అవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ద్రాక్షారామం వంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు స్థానికులతో అనా కొణిదెల‌ ప్రతిస్పందించిన తీరు.. వారి పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం వంటి ఘట్టాలు ప్రజల మనస్సులో త‌నై గౌరవాన్ని రెట్టింపు చేశాయి.

రాజకీయ ఆడంబరాలకు దూరంగా ఉంటూనే... తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో... సాంప్రదాయ బద్ధమైన ప్రవర్తనతో ఆనా కొణిదెల ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీమతిగా అనా అందిస్తున్న ఈ మానసిక మద్దతు, తెలుగు సంస్కృతి పట్ల ఆమె చూపుతున్న ఆరాధన నేడు తెలుగు ప్రజల్లో.. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో త‌న‌ ఇమేజ్‌ను - అభిమానాన్ని రోజురోజుకూ ఆకాశానికి ఎత్తుతోంది.