Begin typing your search above and press return to search.

జ్ఞానానికే అంకితమైన జీవితం..

కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణం తాలూకా హరళహళ్లిలో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది. సాధారణంగా అది ఇల్లు మాత్రమే కాదు, లక్షలాది పుస్తకాలతో నిండిన జ్ఞాన భాండాగారం.

By:  A.N.Kumar   |   24 Aug 2025 1:00 PM IST
జ్ఞానానికే అంకితమైన జీవితం..
X

కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణం తాలూకా హరళహళ్లిలో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది. సాధారణంగా అది ఇల్లు మాత్రమే కాదు, లక్షలాది పుస్తకాలతో నిండిన జ్ఞాన భాండాగారం. పరిశోధకులు, రచయితలు, ఉపాధ్యాయులు, విమర్శకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ఎప్పుడూ కిటకిటలాడే ఈ స్థలం.. నిజంగా ఒక సజీవ విశ్వవిద్యాలయంలా అనిపిస్తుంది.

ఇక్కడ నవలలు, సాహిత్యం, పురాణాలు, విజ్ఞానం, టెక్నాలజీ, సినిమాలు, క్రీడలు ఇలా ఏ రంగమైనా పుస్తకం లభిస్తుంది. 8 విదేశీ భాషల్లోనూ, 22 భారతీయ భాషల్లోనూ సుమారు 15 లక్షల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ మహా సంపదను సేకరించింది ఒక్కరే మండ్య జిల్లా కెన్నాళ్లు గ్రామానికి చెందిన అంకేగౌడ (76).

-పుస్తకాలపై పుట్టిన మక్కువ

కాలేజీ రోజుల్లో పుస్తకాలు సులభంగా దొరకకపోవడంతో, "నాకు సొంతంగా పుస్తకాలు ఉండాలి" అనే ఆలోచన అంకేగౌడలో చిగురించింది. ఆ చిన్న కోరిక క్రమంగా అతని జీవిత లక్ష్యమైంది. 21 ఏళ్ల వయసులో మొదలైన ఈ పుస్తకాల సేకరణ, ఇప్పుడు ఐదు దశాబ్దాల మహాయజ్ఞంగా మారింది.

-కష్టాల్లోనూ పుస్తకాల కోసం కృషి

మండ్య చక్కెర పరిశ్రమలో 30 ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన అంకేగౌడ, తన జీతంలో 80 శాతం పుస్తకాలకే ఖర్చు పెట్టేవారు. కొందరు దాతలు, పాఠకులు కూడా సహాయం చేస్తూ తమ వద్ద ఉన్న పుస్తకాలను ఇస్తుంటారు. అయినప్పటికీ, ఈ ప్రైవేట్ గ్రంథాలయం నడవడానికి సహాయకులను పెట్టుకునే స్థోమత లేకపోవడంతో, కుటుంబ సభ్యులే నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

- పుస్తకాల ఇల్లు – ప్రజల గ్రంథాలయం

ప్రతిరోజూ స్వయంగా పుస్తకాలను శుభ్రం చేయడం, సక్రమంగా పేర్చడం – ఇవన్నీ అంకేగౌడే చేస్తారు. పాఠకుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తన ఇల్లు జ్ఞానాన్ని పంచే గృహమయ్యేలా చూసుకుంటున్నారు.

సమాజంలో చాలా మంది తమ సొంత ఆస్తులు, భవనాలు సేకరించడానికి జీవితాన్ని అర్పిస్తారు. కానీ అంకేగౌడ మాత్రం పుస్తకాలకే జీవితాన్ని అంకితం చేశారు. ఆయన కృషి వల్ల హరళహళ్లిలోని ఈ పుస్తకాల ఇల్లు, పుస్తక ప్రియులకు ఒక ఆశ్రయం, పరిశోధకులకు ఒక ఆభరణం, తెలుగు సహా అనేక భాషల అభ్యాసకులకు ఒక వరం అయింది.