ఒక్క అనిరుధ్‌కే కాదు.. ఏ ఎమ్మెల్యేకూ నిధులివ్వలేని పరిస్థితి.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ఓవైపు పైసల్లేవు.. ఆర్థిక సంక్షోభం.. పథకాలు భారమవుతున్నాయి.. పాలన సాగించడానికే ఆపసోపాలు.. ఇచ్చిన హామీల అమలు ఇంకా పెండింగ్ ఉంది.
By: A.N.Kumar | 29 Oct 2026 4:53 PM ISTఓవైపు పైసల్లేవు.. ఆర్థిక సంక్షోభం.. పథకాలు భారమవుతున్నాయి.. పాలన సాగించడానికే ఆపసోపాలు.. ఇచ్చిన హామీల అమలు ఇంకా పెండింగ్ ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు నిధుల కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు సర్దలేని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఎమ్మెల్యే స్వరం పెచ్చరిల్లుతుండగా.. సర్దుబాటు చేయలేని కాంగ్రెస్ అధిష్టానం.. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నిధులు లేకపోవడం.. సర్దుబాటు చేయకపోవడం కాంగ్రెస్ సర్కార్ తప్పు. ఆ తప్పు ప్రశ్నించిన వారిపై చర్యలు అంటే అధిష్టానం ఆలోచించాల్సిన విషయం. రేపు అందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఎంత మందిపై వేటు వేస్తారన్నది ప్రశ్న.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో నిధుల విడుదల, అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల అంశం తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల లభ్యతపై ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తీవ్రంగా పరిగణించింది.
చావడానికైనా సిద్ధమే.. అనిరుధ్ రెడ్డి ఆవేదన
తన నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా నియోజకవర్గంలో పనుల బిల్లులు రావాలంటే నేను చనిపోవాల్సిందేనా? నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే చావడానికైనా సిద్ధమే" అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజాప్రతినిధిగా ఉంటూనే స్వపక్ష ప్రభుత్వ తీరుపై ఈ స్థాయిలో నిరసన తెలపడం కాంగ్రెస్ లో చిచ్చురాజేసింది.
క్రమశిక్షణ చర్యలు తప్పవు : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిధుల కొరత అనేది ఒక్క జడ్చర్ల నియోజకవర్గానికే పరిమితం కాలేదని.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే తరహా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ పరిధిలో మాట్లాడాల్సిన అంశాలను రచ్చకెక్కించడం సరికాదని హితవు పలికారు. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. క్రమశిక్షణ కమిటీ పరిశీలన అనంతరం అనిరుధ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కేంద్రంపై ధ్వజమెత్తిన మహేశ్ కుమార్ గౌడ్
ఇదే సందర్భంలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ తీరుపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో బీజేపీని ఓడించడమే కాంగ్రెస్ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయమని వ్యాఖ్యానించారు. మోదీ మీడియా సమావేశాలు పెట్టకుండా కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి తెలంగాణ నుంచి కార్యకర్తలను తరలించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కేటాయించడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజాదరణను చూసి బీజేపీ భయపడుతోందని.. అందుకే అడ్డంకులు సృష్టిస్తోందని ఆక్షేపించారు.
కాంగ్రెస్‌కు సవాలుగా మారిన అంతర్గత అసంతృప్తి
ఒకవైపు ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల బిల్లులు రాక నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు పార్టీ క్రమశిక్షణ పేరిట చర్యలకు సిద్ధమవ్వడం కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం కేవలం అనిరుధ్ రెడ్డి నోటీసులకే పరిమితమవుతుందా లేక రాష్ట్రవ్యాప్తంగా నిధుల కొరతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
