Begin typing your search above and press return to search.

పవన్ గుడుంబా తాగితే తప్పులేదా? సినీ యాక్టర్లందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..

తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

By:  A.N.Kumar   |   31 March 2026 11:46 PM IST
పవన్ గుడుంబా తాగితే తప్పులేదా? సినీ యాక్టర్లందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి..
X

తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా “సినిమా రిలీజ్ కావాలంటే హీరోలకు డ్రగ్స్ టెస్ట్ తప్పనిసరి చేయాలి” అనే ఆయన డిమాండ్ వివాదానికి కేంద్రబిందువైంది.

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోలు మద్యం సేవించే సన్నివేశాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారని.. కానీ రాజకీయ నాయకులు లేదా ప్రజా ప్రతినిధులు ప్రజల ప్రయోజనాల కోసం సారా వంటి అంశాలపై మాట్లాడితే విమర్శలు, ట్రోల్స్ ఎదురవుతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమాలో గుడుంబా తాగే సన్నివేశాన్ని ఉదాహరణగా చూపిస్తూ “అప్పుడు అది ఎంజాయ్ చేస్తారు… మరి మేము మాట్లాడితే తప్పా?” అని ప్రశ్నించారు.

ఇప్పపువ్వు ఆధారంగా తయారయ్యే ఇప్పసారాను ప్రోత్సహించాలనే తన ఉద్యమాన్ని కూడా ఆయన వివరించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఇది ఒక ముఖ్యమైన మార్గమని, ప్రభుత్వం అటవీ భూముల్లో ఇప్ప చెట్లను పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు మద్దతుగా సంతకాలు చేశారని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనులకు స్థిరమైన ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు.

అయితే ఈ ఉద్యమంలో భాగంగా సినిమా సన్నివేశాలను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారి తీసింది. సినిమా సన్నివేశాలు కల్పితం అయినప్పటికీ వాటిని వాస్తవాలుగా చూపిస్తూ వాదనలు చేయడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా డ్రగ్స్ సమస్యపై కూడా అనిరుధ్ రెడ్డి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. సినీ రంగంలో డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉందనే ప్రజాభిప్రాయాన్ని తొలగించాలంటే పారదర్శకత అవసరమని, అందుకే నటులకు రెగ్యులర్ డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలని అన్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించి, వాటిలో విఫలమైతే సినిమాల విడుదలను నిలిపివేయాలని సూచించారు.

ఇదే విధానం రాజకీయ నాయకులకూ వర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా మూడు నెలలకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, టెస్ట్‌కు నిరాకరించే వారిని శాసనసభలోకి అనుమతించకూడదని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని, పారదర్శకత కోసం ఇదే మార్గమని అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన అనిరుధ్ రెడ్డి ఆయనకు మద్యం లేదా ధూమపానం అలవాట్లు లేవని పేర్కొన్నారు. నాయకుడిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

మొత్తంగా సినిమాలు, రాజకీయాలు, సమాజపు ద్వంద్వ ధోరణులపై అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తూ, డ్రగ్స్ నియంత్రణపై కొత్త డిబేట్‌కు నాంది పలికాయి.